ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
చొప్పదండి: పట్టణంలోని మసీదు ముందు గల బొడిగె వెంకన్న ఇల్లు శుక్రవారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని కాలిపోయింది. సమ్మక్క, సారలమ్మ జాతరను పురస్కరించుకొని ఇంటికి తాళం వేసి వెళ్లారు. తాళం వేసిన ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేవు. కరీంనగర్ నుంచి ఫైరింజన్ వచ్చేసరికి ఇల్లు కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌రెడ్డి తెలిపారు. ప్రమాదానికి కారణం విచారణ తర్వాత తెలుస్తుందన్నారు.
ఉరి వేసుకొని వృద్ధుడి ఆత్మహత్య
గంగాధర: మండలంలోని పోతుగంటిపల్లికి చెందిన కదారి మల్లారెడ్డి(85) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. మల్లారెడ్డి భార్య అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతిచెందింది. దీంతో మల్లారెడ్డి తన చిన్న కుమారుడు ఇంటి పక్కన ఓ గదిలో ఉంటున్నాడు. ఒంటరిగా జీవిస్తున్న మల్లారెడ్డి మానసికంగా వేదన చెందుతూ శుక్రవారం ఇంటిలో దూలానికి దోతితో ఉరివేసుకున్నాడు. కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
చొప్పదండి: కుటుంబంతో సహా సమ్మక్క జాతరకు వెళ్లగా ఇంటి తాళం పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడిన ఘటన చొప్పదండిలో జరిగింది. పట్టణంలోని మర్లవాడకు చెందిన అమరగొండ బీరయ్య గురువారం రాత్రి పట్టణ శివారులోని సమ్మక్క–సారలమ్మ దర్శనానికి కుటుంబంతో సహా వెళ్లారు. రాత్రి జాతర స్థలంలోనే ఉన్నారు. ఉదయం ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా 28 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి పట్ట గొలుసులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై నరేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. నిందితులను పట్టుకకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు.


