చలికాలం.. కిడ్నీలు పైలం
కరీంనగర్: చలికాలం వచ్చిందంటే చాలా మందిలో నీరు తాగే అలవాటు గణనీయంగా తగ్గిపోతుంది. దాహం వేయకపోవడం, చెమట తక్కువగా రావడం వల్ల శరీరానికి అవసరమైనంత నీరు అందడం లేదు. ఇదే సమయంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో కిడ్నీరాళ్ల బాధితుల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. చలికాలంలో ఏర్పడే కిడ్నీ రాళ్లు నిర్లక్ష్యం చేస్తే చివరకు అవయవం వైఫల్యానికి కూడా దారి తీయవచ్చని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా కిడ్నీలు రక్తాన్ని వడపోసి మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. శరీరంలో నీటి పరిమాణం తగ్గినప్పుడు మూత్రం సాంద్రత పెరుగుతుంది. ఇందులోని కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి లవణాలు కలసి కిడ్నీలో రాళ్లుగా మారుతాయి. చలికాలంలో నీరు తక్కువగా తాగడం, అధిక ఉప్పు–ప్రోటీన్ ఆహారం తీసుకోవడం, శారీరక చురుకుదనం తగ్గడం ఈ సమస్యను మరింత పెంచుతాయి. కిడ్నీలో ఏర్పడిన రాయి మూత్రనాళంలో అడ్డుపడితే మూత్రం బయటకు వెళ్లకుండా కిడ్నీలోనే నిలిచిపోతుంది. దీంతో కిడ్నీ వాపునకు గురై ‘హైడ్రోనెఫ్రోసిస్’ ఏర్పడుతుంది. ఈ స్థితి కొనసాగితే కిడ్నీలోని వడపోత కణాలు (నెఫ్రాన్లు) క్రమంగా దెబ్బతిని కిడ్నీ పనితీరు తగ్గుతుంది. అలాగే రాళ్ల వల్ల కిడ్నీలో ఇన్‌ఫెక్షన్ ఏర్పడితే పైలోనెఫ్రిటిస్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చి కిడ్నీ కణజాలం శాశ్వతంగా నాశనం అయ్యే ప్రమాదం ఉంది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడితే..
మూత్రం పరిమాణం తగ్గడం, నడుము భాగంలో తీవ్రమైన నొప్పి, కాళ్లు, పాదాల్లో వాపు, వాంతులు, వికారం, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సొంత వైద్యం మానుకోవాలి. నొప్పి తగ్గిందని పెయిన్‌కిల్లర్లు వాడుతూ కాలం గడపడం ప్రమాదకరం. అవి కూడా కిడ్నీలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. చలికాలంలో రోజుకు కనీసం 2.5– 3 లీటర్ల నీరు తాగాలి. తరచూ నొప్పి వస్తే లేదా రాయి పరిమాణం 5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. సకాలంలో చికిత్స తీసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్‌ను పూర్తిగా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నిర్ధారణ, చికిత్స ఇలా..
రాయి పరిమాణం, అడ్డంకిని తెలుసుకోవడానికి కేయూబీ అల్ట్రాసౌండ్/ సీటి స్కాన్ చేస్తారు. కిడ్నీ పనితీరు సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సీరమ్ క్రియాటినిన్– జీఎఫ్‌ఆర్ పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. రాళ్లు పెద్దవిగా ఉన్నప్పుడు లిథోట్రిప్సీ, ఆర్‌ఐఆర్‌ఎస్ వంటి లేజర్ చికిత్స ద్వారా రాళ్లను తొలగిస్తారు.


