నాటి అల్ఫా.. నేడు రాజీవ్ చౌక్
విద్యానగర్(కరీంనగర్): నగరంలోని రాజీవ్ చౌక్ ఎంతో ప్రసిద్ధి చెందింది. పండుగలు, వేడుకల సందర్భంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రస్తుత రాజీవ్‌చౌక్‌ను గతంలో అల్ఫాచౌరస్తాగా పిలిచేవారు. ఇదే ప్రాంతంలో ఉన్న తీరందాజ్ థియేటర్ ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేది. దాని చుట్టు పక్కల పంటపొలాలు ఉండేవి. 1953లో నిర్మించిన వక్ఫ్‌బోర్డు బిల్డింగ్‌లో చిన్న పిల్లలకు టీకాలు వేసేవారు. తర్వాత బిల్డింగ్ తీసేసి రెండంతస్తులల్లో దుకాణాల సముదాయం నిర్మించారు. ఈ సముదాయం ఎదురుగా అల్ఫా పేరుతో హోటల్ ఉండేది. ఈ హోటల్‌లో ఇరానీ చాయ్, బిస్కెట్టు, బన్ను అమ్మేవారు. ఉదయం సాయంత్రం ఈ హోటల్‌లో చాయ్ తాగేవారితో రద్దీగా ఉండేది. అల్ఫా హోటల్ పేరుతోనే ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ మరణనంతరం 12 జనవరి 1994లో ఇక్కడి సర్కిల్‌లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పుడే ఈ ప్రాంతానికి రాజీవ్‌చౌక్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం రాజీవ్‌చౌక్‌గా వ్యవహరిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రాంతం వారధి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇటీవల ఇక్కడి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించారు. అధునాతన కాంస్య విగ్రహం ఏర్పాటుకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు పనులు కొనసాగుతుండగా.. విగ్రహం ఏర్పాటు.. చౌరస్తా సుందరీకరణతో ఈ ప్రాంతం మరింత ప్రాచూర్యం పొందనుంది.


