లాభాల ‘పుట్ట’
● పుట్ట గొడుగుల పెంపకంలో వ్యవసాయ విద్యార్థులు
● తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం ● రైతులకు శిక్షణ ఇస్తామంటున్న ప్రొఫెసర్లు
జగిత్యాలఅగ్రికల్చర్: ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో చాలా మంది ఔత్సాహిక రైతులు పెంచేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలాస వ్యవసాయ కళాశాలకు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు సైతం తమ ప్రాజెక్టులో భాగంగా పుట్టగొడుగులు పెంచుతున్నారు. వీరికి గైడ్‌గా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్లాగౌడ్ వ్యవహరిస్తున్నారు.
ఇలా పెంచుతారు
పుట్టగొడుగులను పెంచేందుకు 6–12 నెలల వయస్సు ఉన్న గడ్డిని ముక్కలు చేస్తారు. ముక్కలు చేసిన గడ్డిపై నీళ్లు చల్లి, తగినంత తేమ ఉండేలా చూస్తారు. ఒక కిలో వరిగడ్డికి 50 గ్రాముల స్పాన్ కలిపి పాలిథీన్ సంచుల్లో నింపి రబ్బర్ బ్యాండ్ వేస్తారు. సంచులను తగినంత తేమ, ఉష్ణోగ్రత ఉన్న గదుల్లోకి పెడితే 3–4 వారాలకు గడ్డిపైన తెల్లని శీలింధ్రం వస్తోంది. ఇలా చేసిన 6–7 రోజులకు తొలి పంట వస్తుంది. రంగు మారిన, మచ్చలు కలిగిన గడ్డిని ఉపయోగించరు. పుట్టగొడుగులు పెంచే గదుల్లో పురుగులు, కీటకాలు, ఎలుకలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గదిలో ఉష్ణోగ్రత, తేమ శాతం తటస్థంగా ఉండేలా చూస్తారు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనువైన వరిగడ్డి పుట్టగొడుగులు, బటన్, అయిస్టర్, పాల పుట్టగొడుగుల రకాలను ఎక్కువగా పెంచుతున్నారు.
లాభాలు
పుట్టగొడుగులను తక్కువ పెట్టుబడితో, తక్కువ వ్యవధిలో అంటే 30–40 రోజుల్లో పెంచవచ్చు. వీటిలో ప్రొటీన్స్ వరి, గోధుమ, కూరగాయల కంటే అధికంగా ఉంటాయి. తాజా పుట్టగొడుగుల్లో విటమిన్–డీ అధికంగా ఉంటుంది. పోటాషియం, సోడియం నిష్పత్తి, పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల బీపీ, ఆసిడిటితో బాధపడేవారికి చాలా ఉపయోగపడుతుంది. విటమిన్–బీ కాంప్లెక్స్, విటమిన్–సీ, ఫాంటాథెనిక్, నియాసిన్లు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల తాజా పుట్టగొడుగుల్లో 43 కిలోల కాలరీలు ఉంటాయి.
మార్కెట్లో డిమాండ్
పుట్టగొడుగులపై ప్రజలకు అవగాహన పెరగడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండటంతో శాఖాహారులకు మాంసాహారంగా ఉపయోగపడుతుంది. గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళలు, సన్నకారు రైతులు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపడితే మంచి ఆదాయం పొందవచ్చు. పుట్టగొడుగుల ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయొచ్చు. వాటితో పచ్చళ్లు, బిర్యాని, సూప్ పౌడర్, కెచప్ వంటి పదార్థాలను తయారు చేయవచ్చు.


