గుండెపోటుతో అన్నదాత మృతి
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): పొద్దంతా వ్యవసాయ పనులు చేసిన అన్నదాత నిద్రలోనే గుండెపోటుకు గురై ఆకస్మికంగా మృతిచెందిన ఘటన బాధిత కుటుంబ సభ్యులను కలచివేసింది. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో విషాదం నింపింది. వివరాలు.. బండలింగంపల్లికి చెందిన రైతు జంగా ముత్తిరెడ్డి (45) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం పొద్దంతా ట్రాక్టర్‌తో పొలం దున్ని ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం రోజులాగే తన బెడ్ రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాడు. వేకువజామున కుటుంబ సభ్యులు నిద్ర లేపగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. కుటుంబీకులు స్థానిక వైద్యులకు చూపించగా అప్పటికే మరణించినట్లు వారు ధ్రువీకరించారు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు నరేశ్, కూతురు దివ్య ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
లారీ బోల్తా.. డ్రైవర్‌కు స్వల్పగాయాలు
ధర్మపురి: పత్తి లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాయపట్నం నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న లారీ ధర్మపురిలోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ శివారులోని కల్వర్టు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాలు.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన యాదగిరి, నర్సింలు ద్విచక్ర వాహనంపై సిరిసి ల్లకు వస్తుండగా, కల్వర్టుపై వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో యాదగిరి తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. కాగా ఈ కల్వర్టుపై రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదకరంగా మారిన కల్వర్టుకు మరమ్మతు చేయాలని వాహనదారులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న ఈ కల్వర్టుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేసి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు
పాలకుర్తి(రామగుండం): మండలంలోని జీడీనగర్ గ్రామంలో ఆదివారం తన కారుపై దాడి చేసిన సూర సంతోష్‌పై సోమవారం బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు ఫీట్ల గోపాల్ తెలిపారు. ఎన్నికల్లో తాను బలపరిచిన అభ్యర్థి సూర రమ గెలుపొందగా.. అభినందనలు తెలియజేసేందుకు వచ్చిన తనను బీసీకాలనీలో నివాసముండే సూర సంతోష్ పరుష పదజాలంతో దూషిస్తూ తన కారు అద్దాలు ధ్వంసం చేశాడని పేర్కొన్నారు.
గుండెపోటుతో అన్నదాత మృతి


