సమ్మక్క భక్తులకు ముస్తాబైన వేములవాడ
వేములవాడ: సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ రాజన్న, అనుబంధ ఆలయాలను అధికారులు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క జాతరకు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకుని, కోడె మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయంగా ఉండటంతో భక్తుల రద్దీ ప్రారంభమైంది. దీంతో, ఆలయ అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుడి చెరువు పార్కింగ్ ప్లేస్‌లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం, రూ.100 కోడె కట్టె దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. వీఐపీ రోడ్‌తోపాటు ఆలయ పరిసరాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు.
స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు
వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా భక్తులు స్నానం చేసేందుకు ప్రత్యేకంగా వేడి నీరు (హాట్ వాటర్) సదుపాయం కల్పించినట్లు ఆలయ ఈవో రమాదేవి సోమవారం తెలిపారు. స్నానఘాట్ల వద్ద స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, భక్తులు సులభంగా స్నాన ప్రాంతాలను గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం పరిశుభ్రత, నీటి సరఫరా, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ప్రత్యేక లైటింగ్.. వేడి నీటి సౌకర్యం
సమ్మక్క భక్తులకు ముస్తాబైన వేములవాడ


