వరినారుపై చలి పంజా
మల్లాపూర్(కోరుట్ల): యాసంగి సీజన్‌కు సంబంధించి వరినారుపై చలి పంజా విసురుతుంది. దీంతో నారు ఎదగడం లేదు. వరి సాగు కోసం రైతులు 10– 15 రోజుల క్రితం నారు పోశారు. చలిగాలులు తీవ్రంగా వీస్తుండడం నారు పెరుగుదలకు ఆటంకంగా మారింది. నాలుగైదు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళ అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరిగి నారు ఎదగకపోవడంతో పాటు ఎర్రబడిపోయే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
చలి ప్రభావంతో నారు భూమిలో నుంచి సరైన పోషకాలను గ్రహించలేదు. దీంతో నారు ఇటుక రంగులోకి మారి పలు ప్రాంతాల్లో ఎదగడం లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో నారుమడిపై నేరుగా మంచు పడకుండా నాలుగు వైపుల కర్రలు పాతి పాలిథీన్ కవర్లు కట్టాలని సూచిస్తున్నారు. జింక్ లోప నివారణకు నారుపై జింక్ సల్పేట్‌ను నీటిలో కలిపి పిచికారీ చేయాలని, రాత్రి వేళల్లో నారుమళ్లకు నీరు పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పాత నీరు తీసేసి వెచ్చటి నీరు అందించాల్సింగా పేర్కొంటున్నారు. జింక్, మాంగనీస్, రాగి వంటి సూక్ష్మపోషక ద్రావణాలను పిచికారీ చేయాలని సూచిస్తున్నారు.
చలిగాలులకు ఎదగని నారు


