‘ఊయల’కు చేరిన ఐదు నెలల పసికందు
కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘ఊయల’ మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు ఐదు నెలల వయసున్న పసికందును ఆ ఊయలలో వదిలి వెళ్లారు. పసికందుకు సంబంధించి ఆరోగ్య వివరాల రికార్డును కూడా చిన్నారివద్దనే ఉంచడం గమనార్హం. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అప్రమత్తమై చిన్నారిని పరిశీలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉందని, ఐసీయూలో ఉంచి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కుటు ంబ పరిస్థితులు ఎలా ఉన్నా, శిశువులను నిర్లక్ష్యంగా వదిలేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయలలో ఉంచడం ద్వారా వారి ప్రాణాలు కాపాడవచ్చని మరోసారి ఈ ఘటన రుజువుచేసింది. పిల్లలు భారంగా అనిపించినా, జీవితం విలువైనదేనని గుర్తించి ఊయ ల మార్గాన్ని ఎంచుకోవడం మానవత్వానికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఊయల వ్యవస్థ వల్ల అనేకమంది చిన్నారులకు కొత్త జీవితం లభిస్తోందని, సమాజం మరింత బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
● కుటుంబాన్ని పోషించే దారి లేక ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచి ఉద్యోగం కోల్పోయాడు. కుటుంబాన్ని పోషించే దారి లేక మనస్తాపం చెందాడు. గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్లకు చెందిన రెవెల్లి రాజ్‌కుమార్(38) జీవనోపాధి కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఏడాదిగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల గ్రామానికి చేరుకున్నాడు. ఈనెల 11న ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్‌కుమార్ భార్య రజిత.. తన పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది. రాజ్‌కుమార్ స్వగ్రామంలోనే ఉండిపోయాడు. అయితే, హైదరాబాద్ వెళ్లాక భార్య రజిత తన భర్తతో ఫోన్‌లో మాట్లాడింది. హైదరాబాద్ రాకపోవడంతో ఉద్యోగంలోంచి తొలగించారని, చిట్టీ డబ్బులు ఎలా చెల్లివస్తాని నిలదీసింది. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన రాజ్‌కుమార్ ఉరివేసుకుని చనిపోయాడు. తన కుమారుడు ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానం లేదని తండ్రి పీసారయ్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఏఎస్సై నీలిమ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు దినేశ్, కూతురు లాస్య, తల్లిదండ్రులు సమ్మక్క –పీసారయ్య ఉన్నారు. రాజ్‌కుమార్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


