నోట్లు పాయే.. ఓట్లు రాకపాయే!
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి, మలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండు విడతల్లోని ఫలితాలపై అభ్యర్థులు పోస్టుమార్టం చేస్తున్నారు. నోట్ల కట్టలు పాయే.. ఓట్లు రాకపాయే అంటూ ఓటమి పాలైన అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రెండో విడత ఫలితాలు వెలువడిన ఆదివారం వరకు అభ్యర్థులు చేసి ఖర్చు తడిసి మోపైడెంది. తొలివిడత నామినేషన్ల పర్వం నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు నాటికి చేసిన ఖర్చు ఎంత.. వచ్చిన ఓట్లు ఎన్ని అని అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. డబ్బులను లెక్క చేయకుండా ఖర్చు చేసిన వారిలో గెలిచిన వారు సంబరాల్లో ముగిని తేలుతుండగా.. ఓడిన వారు ఎక్కడ బోల్తాకొట్టామని సమీక్షించుకుంటున్నారు.
నమ్మకంగా వంచించారంటూ ఆవేదన
ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఖర్చుకు వెనకాడకుండ ముందుకెళ్లిన అభ్యర్థులు పరాజయభారంతో చేసిన ఖర్చును లెక్కలేస్తున్నారు. కులసంఘాల వారీగా, ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బు ఓట్లను రాల్చకపోవడంతో ఏమైందనే ఆవేదనకు లోనవుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేశారు. ఇంకా కులసంఘాలకు, యువజన సంఘాలకు, సన్నిహితులకు మందుపార్టీలు అదనం. మహిళా ఓటర్లకు చీరల పంపిణీ, వెండి భరణిలు, దేవుడి లడ్డూలను పంపిణీ చేసిన అభ్యర్థులు గెలుపు అంచు వరకు వెళ్లి ఓడిపోవడంతో అవాక్కయ్యారు. నమ్మకంగా వంచించారంటూ కోవర్టు రాజకీయాలు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో అన్ని గ్రామాల్లో ఎన్నికలు సవ్యంగా సాగడంతో అధికారులు ఫలితాలు ప్రకటించారు. ఒక రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడఅర్బన్ మండలం చింతల్‌ఠాణాలో చనిపోయిన వ్యక్తి చెర్ల రమేశ్ గెలుపొందడంతో ఆ ఫలితాలను నిలిపివేశారు.
ఓట్ల ఖరీదు రూ.200 కోట్లు
ఉమ్మడి జిల్లాలో తొలి, మలి విడతల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు రూ.200 కోట్ల వరకు అభ్యర్థులు ఖర్చు పెట్టారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే రెండు విడతల్లో దాదాపు రూ.50కోట్లకు పైగా డబ్బును వెచ్చించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో పక్షం రోజులుగా సగటును ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అనధికారికంగా వెచ్చించారు. ఒక్కో ఊరిలో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు కలిపి సగటున రూ.35 లక్షల వరకు ఖర్చు చేశారు. పెద్ద గ్రామాల్లో ఈ వ్యయం మరింత పెరిగింది. ఈ లెక్కన ఒక్కో ఓటు కోసం సగటున సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు రూ.3వేలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఖర్చు చేసిన డబ్బుకు గౌరవ ప్రదమైన ఓట్లు రాకపోయేనని పరాజితులు కన్నీరుపెడుతున్నారు. విజయం సాధించిన అభ్యర్థులు లెక్కల జోలికి వెళ్లకుండా విజయోత్సవాల్లో ఉన్నారు.
వదిలిందెంత? వచ్చిందెంత ?
ఎన్ని‘కల’ల్లో రూ.‘లక్ష’ణంగా ఖర్చు
పైసలు పోయే.. ఫలితం లేకపాయే
‘పంచాయతీ’ ఎన్నికల ఫలితాలపై పరాజితుల పోస్ట్‌మార్టం
నమ్మకంగా వంచించారని ఆవేదన
తొలి, మలి విడతల్లో అనధికారిక ఖర్చు రూ.200 కోట్లు


