మేడిపల్లి ఓసీపీలో పులి సంచారం
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)లో ఆదివారం పెద్దపులి సంచారం స్థానికుల్లో కలకలం రేపింది. రామగుండం డివిజన్–1 పరిధిలోని మేడిపల్లి ఓసీపీలో బొగ్గు నిల్వలు అడుగండంతో దానిని గతంలోనే యాజమాన్యం మూసివేసింది. ఆ ప్రాంతంలోనే పెద్దపులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మంచిర్యాల వైపు నుంచి గోదావరి నది దాటి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు వారు వెల్లడిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో పులి వేలిముద్రలను వారు పరిశీలించారు. లింగాపూర్ శ్మశానవాటిక వైపు ఉన్న ముళ్ల పొదల్లో పులి సంచరినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఫారెస్ట్ అధికారి శివయ్య, రేంజ్ ఆఫీసర్ రహ్మతుల్లా తెలిపారు. దీంతో లింగాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఒంటరిగా వెళ్లవద్దు – డీఎఫ్‌వో శివయ్య
మేడిపల్లి, లింగాపూర్, పాములపేట, హౌసింగ్‌బోర్డు కాలనీ వాసులు ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని డీఎఫ్‌వో శివయ్య సూచించారు. అవసరమైతేనే గుంపులుగా వెళ్లాలని, ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లో పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని అన్నారు. ద్విచక్రాహనాలపై కూడా ఒంటరిగా వెళ్లవద్దని ఆయన పేర్కొన్నారు.
స్థానికుల్లో భయం.. భయం
జ్యోతినగర్(రామగుండం): మేడిపల్లి ఓసీపీ ప్రాంతంలో పులి సంచారంతో స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఓసీపీ, సమీప గోదావరి నదీతీరంలో పులి సంచరించినట్లు పాదముద్రలు పరిశీలించిన అనంతరం.. అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ పంప్‌హౌస్ ప్రాంతం మల్కాపూర్ గ్రామానికి సమీపంలో ఉండడంతో ఎప్పుడేమవుతుందోనని గ్రామస్తులు భయపడిపోతున్నారు. రెండేళ్ల క్రితం పులి సంచరించినట్లు స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
పేట్రేగనున్న స్క్రాప్ చోరీ ముఠాలు
ఓపెన్‌కాస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో జనసంచారం ఉండదని భావించే ఇనుప సామాను దొంగలించే ముఠాలు రెచ్చిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. గతంలో సైతం పులి సంచారం ప్రచారం కావడంతో పెద్దమొత్తంలో ఇనుస సామగ్రి చోరీ అయినట్లు తెలుస్తోంది.
గోదావరి నదీతీరంలో పాదముద్రలు
నిర్ధారించిన అటవీశాఖ అధికారులు


