గ్రామాల్లో వికసిస్తున్న కమలం
కరీంనగర్: గ్రామాల్లో కమలం పార్టీ వికసిస్తోందని 1, 2వ విడత ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జరుగబోయే మూడో విడత ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటుతామని అన్నా రు. మొదటి, రెండో విడత ఫలితాలు సంతృప్తిని చ్చాయని, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానంగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సర్పంచ్ స్థానానికి గట్టి పోటీ ఇచ్చారని, ఎంతోమంది వార్డు మెంబర్లుగా గెలు పొందారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా విశ్వసించారని అన్నారు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల వైపు చూశారని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ చొరవతో నేడు గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ అభ్యర్థులు గెలుపొందిన చోట గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో బండి సంజయ్ కుమార్ ఉన్నారని తెలిపారు. భవిష్యత్ అంతా బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
రూ.18 లక్షలతో రాజీవ్ చౌక్ సుందరీకరణ
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని రాజీవ్ చౌక్ సుందరీకరణ పనులు మొదలయ్యాయి. సుడా నిధులు సుమారు రూ.18 లక్షలతో జంక్షన్ పనులు చేపట్టారు. రాజీవ్‌గాంధీ పాత విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం చౌక్‌లోని పాత విగ్రహాన్ని నగరపాలకసంస్థ సిబ్బంది తొలగించారు. జంక్షన్ పనులు పూర్తి అయిన తరువాత కొత్తగా విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాజీవ్ చౌక్ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి రాజమండ్రిలో రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. పది రోజుల్లో పనులు పూర్తి చేసి, రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
27నుంచి రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్, నీలం లక్ష్మణ్ తెలిపారు. కరీంనగర్‌లో ఆదివారం మాట్లాడుతూ.. ఈనెల 13, 14వ తేదీల్లోనే పోటీలు జరగాల్సి ఉండగా, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వే య డం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లా ల నుంచి సుమారు 1,200మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రన్స్, త్రోస్, జంప్స్ విభాగాల్లో 48 అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ప్రతిభ చాటిన మాస్టర్ అథ్లెట్స్‌ను రాజస్థాన్‌లోని ఆజ్మీరాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ వరాల జ్యోతి, స్టేట్ ట్రెజరర్ డి.లక్ష్మి, జాయింట్ సెక్రటరీలు లక్ష్మణ్ రావు, కోశాధికారి శిరీశ్, సలహాదారు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
నగరంలో పునుగు పిల్లి
కరీంనగర్: కరీంనగర్ విద్యానగర్‌లో ఓ ఇంట్లోకి ఆది వారం ఉదయం పునుగు పిల్లి రావడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే శ్రీలక్ష్మి జంతు సంరక్షణశాలకు, ఫారెస్ట్ అధికారులకు సమాచా రం ఇవ్వగా... ఆ ఇంటికి చేరుకొని, అధికారులు, జంతు సంరక్షణశాల నిర్వాహకులు ఆసిరి సుమన్ పునుగు పిల్లిని క్షేమంగా పట్టుకున్నా రు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు ఆ పిల్లిని అప్పజెప్పారు. పిల్లిని క్షేమంగా డీర్‌పార్క్‌లో ఉంచినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.


