ఇక సంగ్రామం
పాత రిజర్వేషన్ల ప్రకారమే
వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం
పాత రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలు
పంచాయతీ తరువాతే ప్రాదేశిక ఎన్నికలు
నిర్వహణకు సిద్ధంగా యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు జోష్‌తో స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లి, తరువాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన కేబినెట్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి మొదటి వారంలోగా లోకల్‌బాడీ ఎన్నికలు పూర్తి చేయాలని యోచిస్తోంది.
యంత్రాంగం సన్నద్ధం
స్థానిక ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉండటంతో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా, ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాయి. బ్యాలెట్ పేపర్లు, సిబ్బంది, నోడల్ అధికారుల కేటాయింపు, రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రెండు విడుతలుగా ఆర్వోలు, పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. సర్పంచ్‌లకు గులాబీ రంగు, వార్డు మెంబర్స్‌కు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను ముద్రించేందుకు సిద్ధంగా ఉంచారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయింపు పై పలువురు హైకోర్టుకు పోవడంతో స్టే ఇవ్వటంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
మొదట పంచాయతీ.. తరువాతే పరిషత్
ఇటీవల విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌లో మొదట పరిషత్, తరువాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా నిర్ణయించారు. మారిన పరిస్థితుల్లో తొలుత పంచాయతీ, తదుపరి పరిషత్ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టులో సైతం పంచాయతీ ఎన్నికల పైనే కేసులు ఉండటంతో రిజర్వేషన్ల పీటముడి విప్పి ఎన్నికలకు పోనుంది.
కుంటుపడిన పాలన
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయి పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. 2024 జూలై నాటికి స్థానిక సంస్థల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో పాలన కొనసాగుతోంది. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయి పాలన వ్యవస్థ కుంటుపడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం, స్థానిక ఎన్నికల నిర్వహించేది ఎప్పుడో ఈ నెల 24న హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేయాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ రెండోవారంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమైంది.
కోర్టు రిజర్వేషన్లపై స్టే విధించటం, 24లోపు ఎన్ని కల నిర్వహణ ఎప్పుడు చేపడుతారో హైకోర్టుకు తెలపాల్సి ఉండటంతో, ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు సిద్ధమవుతోంది. 2019లో స్థానిక సంస్థల్లో వివిధ సామాజిక వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలకు పోయే అవకాశాలున్నాయి. ఆయా రిజర్వేషన్స్ ప్రకారం ఐతే మరోసారి రిజర్వేషన్లు మార్చి ప్రకటించాల్సి ఉంటుంది.


