నెలాఖరులోగా నల్లా సర్వే పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో చేపట్టిన నల్లాల సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. సోమవారం నగరపాలకసంస్థఽ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లా కనెక్షన్ల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పాస్‌బుక్ లేని నల్లా కనెక్షన్లు అక్రమమైనవని గుర్తించి, నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీస్ పీరియడ్‌లోగా క్రమబద్ధీకరించుకుంటే నల్లా కనెక్షన్లకు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నల్లా కనెక్షన్ క్యాన్, ఇంటి నంబర్ల వారీగా వివరాలు సిద్ధం చేసి అందించాలన్నారు. కొత్త నల్లా కనెక్షన్‌ల సందర్భంగా వినియోగదారుడిపై సిబ్బంది ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దన్నారు. ఎక్కడా అక్రమాలకు తావివ్వరాదని, క్షేత్రస్థాయిలో ఇలాంటి సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు. విలీన డివిజన్‌లలో గ్రామపంచాయతీ పరిధిలో లీగల్‌గా నమైదైన డేటా ప్రకారం జీరో డొనేషన్‌తో ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కొత్తపల్లి మున్సిపాల్టీ పరిధిలో గతంలో ఉన్న నల్లా కనెక్షన్‌లను సంబంధత ప్రాంత డివైజ్‌కు లింక్ చేయాలన్నారు. అపార్ట్‌మెంట్ల వారిగా నల్లా కనెక్షన్‌ల పూర్తి వివరాలు త్వరగా అందించాలన్నారు. ఎస్‌ఈ రాజ్ కమార్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈలు వెంకటేశ్వర్లు, లచ్చిరెడ్డి పాల్గొన్నారు.


