విన్నపాలు వినవలె
కరీంనగర్ అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు సోమవారం కలెక్టరేట్ బాట పట్టారు. జిల్లా నలుములల నుంచి తరలి రాగా ప్రజావాణిలో అర్జీలు అందజేశారు. వినతి పత్రాలతో తిరగలేకపోతున్నామని, అర్జీలకు విముక్తి కల్పించాలని వేడుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అన్ని విభాగాలు కలుపుకుని మొత్తం 288 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.
రేషన్ లబ్ధిదారులకు ఉచిత సంచులు ఇవ్వడం లేదు. ప్రభుత్వ పథకాలను వివరించే ముద్రలతో పాటు నాణ్యమైన సంచులు ప్రభుత్వం రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తోంది. కానీ డీలర్లు ఇవ్వడం లేదు. ఇదేంటంటే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కార్డుదారులందరికీ చేతి సంచులు అందేలా చర్యలు చేపట్టాలి.
– అబ్దుల్ రహమాన్, యువజన కాంగ్రెస్ నేత
గ్రామంలోని 237, 198 సర్వే నంబర్లలో భూమి ఉంది. సర్వే చేయాలని కోరితే నెలల తరబడి తిప్పుకుంటున్నారు. 237లో సర్వే చేసిన సర్వేయర్ పంచనామా కాపీ ఇవ్వడం లేదు. మీ సేవ ద్వారా ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తు చేశాను. మిగతా సర్వేనంబర్లలో సర్వే చేయడం లేదు. ఇదెక్కడి అన్యాయం. నేను వికలాంగుడిని. దయలేకుండా వ్యవహరిస్తున్నారు. – గుర్రం శంకరయ్య,
వెంకటాయపల్లి, గంగాధర
అక్రమ మార్గంలో అనుమతులు పొంది ఇండస్ టవర్ ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారు. కాలనీవాసుల అంగీకారం లేకుండా పనులెలా చేస్తారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఏ రకంగా అనుమతి ఇస్తారు. ఆస్తి పన్ను రికార్డు ఒకరి పేరున ఉంటే మరొకరు అంగీకారం తెలిపితే అనుమతులెలా ఇస్తారు. తక్షణమే టవర్ పనులను నిలిపివేయడంతో అనుమతి రద్దు చేయండి.
– శివనగర్ కాలనీవాసులు, కరీంనగర్
సిటిజన్, రజ్వీచమాన్ కాలనీలు పల్లెల కన్నా దారుణంగా ఉన్నాయి. వీధి దీపాలు సరిగా లేవు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. సురక్షితమైన తాగునీరు లేక నానాపాట్లు పడుతున్నం. సరిపడా పైపులైన్లు లేకపోగా తదనుగుణ చర్యలు కరవయ్యాయి. రోడ్డు నంబర్ 1 నుంచి 6వరకు గుంతల దారులే. స్మార్ట్‌సిటీలో ఇలాగేనా సౌకర్యాలు.?
– సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ, కరీంనగర్
మొత్తం అర్జీలు: 288
కరీంనగర్ కార్పొరేషన్: 47
హౌజింగ్: 41, ఆర్డీవో, కరీంనగర్: 20
తహసీల్దార్ మానకొండూరు: 10
డీఈవో: 10
విన్నపాలు వినవలె
విన్నపాలు వినవలె
విన్నపాలు వినవలె
విన్నపాలు వినవలె


