నిరీక్షించి.. నీరసించి
రిపేర్లు చేయిస్తున్నాం
రోగనిర్ధారణ పరీక్షలకు ప్రయాస
కొద్ది మాసాలుగా మొరాయిస్తున్న టీ– హబ్
ఫలితం తేల్చేందుకు నాలుగైదు రోజులు
ఇబ్బంది పడుతున్న రోగులు
కరీంనగర్: నిరుపేదలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు కరీంనగర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం (టీ– హబ్) మొరాయిస్తోంది. జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రి ఆవరణలో 2021 జూన్ 7వ తేదీన రూ.3 కోట్ల వ్యయంతో టీ–హబ్‌ను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించి అన్ని రకాల రోగనిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్రారంభించిన ఏడాది వరకు బాగానే నడిచిన టీ– హబ్‌లో మూడేళ్లుగా ప్రతిరోజు సగం పరీక్షలు కూడా జరగడం లేదు. పరీక్షలకు వచ్చిన వారినుంచి తీసుకున్న శాంపిల్స్‌తో ఏ పరీక్షలు జరుగుతాయో కూడా ల్యాబ్ టెక్నీషియన్లు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితం ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి. ఒక్కోసారి నాలుగైదు రోజులు పడుతుందని రోగులు వాపోతున్నారు. ఈ లోపు రోగం ముదిరిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రారంభించిన టీ– హబ్ లక్ష్యం చేరుకోలేక నీరుగారిపోతోంది.
మొరాయిస్తున్న మిషనరీ
రూ.కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన రోగనిర్ధారణ మిషనరీ మొరాయిస్తోంది. ఒక్కోసారి మరమ్మతుకొస్తే బాగుచేయడానికి వారాలు పడుతోంది. నెల రోజులుగా సగానికన్నా తక్కువ టెస్టులు అవుతున్నాయి. తరచూ రిపేర్లు వస్తుండడంతో రోగుల సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత టెస్టు అవుతుందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు రిపేర్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
జరుగుతున్న టెస్టులు ఇవీ
ప్రస్తుతం సీబీపీ, ఏఈసీ, స్టూల్ ఫర్ అక్యూల్ట్‌బల్డ్, ట్రాప్–ఐ, ఎస్– టైపీ, చికున్‌గున్యా, లెప్టోస్పిరా, స్క్రబ్ టైపస్, స్టూల్ ఫర్ ఓవా అండ్ క్రిస్ట్, మలేరియా ర్యాపిడ్, ఈఎస్‌ఆర్, రెటిక్‌కౌంట్, సీరమ్ ఎలక్ట్రోలైట్స్, ఏబీజీ పరీక్షలు జరుగుతున్నాయి.
జరగని టెస్టులు
ఎఫ్‌బీఎస్, ఆర్‌బీఎస్, పీఎల్‌బీఎస్, ఆర్‌ఎఫ్‌టీ, లిపిడ్ ప్రొఫైల్, కాల్సియం, ఎల్‌ఎఫ్‌టీ, యూరిక్ ఆసిడ్, హెచ్‌బీఎ1సీ, ఐరన్, అమైలేస్, ఎల్‌డీహెచ్, థైరాయిడ్ ప్రొఫైల్, సీరమ్ ఫెర్రిటిన్, విటమిన్ డి3, మెగ్నీషియం, విటమిన్ బీ12 వైద్య పరీక్షలు జరగడం లేదు.
ప్రైవేటులో ఆర్థిక దోపిడీ
ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు రోగనిర్ధారణ పరీక్షలు అవసరమైతే ప్రైవేటుకు వెళ్లాల్సిందే. ప్రైవేటులో రోగ నిర్ధారణ పరీక్షలంటే ఇక ఆస్తులు అమ్ముకునుడే అన్నచందంగా మారింది. చిన్న చిన్న పరీక్షలు చేసి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. దీంతో నిరుపేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
గత కొద్దిరోజులుగా మిషనరీలు రిపేర్ అయిన విషయం విధితమే. ఇంజినీర్ల అందుబాటులో లేకపోవడంతో కొంత ఆలస్యం జరిగింది. ప్రస్తుతం అన్ని వర్కింగ్ కండీషన్‌లోకి వస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు మిషనరీలు సిద్ధంగా ఉన్నాయి.
– డాక్టర్ వీరారెడ్డి,
జీజీహెచ్ సూపరింటెండెంట్


