దేదీప్యమానం.. కార్తీక దీపం
నదీస్నానాలు.. ప్రత్యేక పూజలు.. అభిషేకాలు.. అర్చనలు.. దీపారాధనలు.. జ్వాలా తోరణాలు.. తులసీపూజలు.. నోములు, వ్రతాలతో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా భక్తులు శివకేశవాలయాల్లో అభిషేక, అర్చనల్లో పాల్గొన్నారు. నివాసాల్లోని తులసీకోటల వద్ద దీపాలు వెలిగించారు. కేదారీశ్వర నోములు, సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. పొద్దుపోయే వరకు జ్వాలాతోరణ, ఆకాశదీపపూజలతో ఆలయాలు కళకళలాడాయి. కరీంనగర్‌లోని మార్కెట్‌రోడ్డు వేంకటేశ్వరాలయం, పాతబజార్ శివాలయం, రామేశ్వరాలయం, భవానీ శంకరాలయంలో సందడి నెలకొంది. నగునూర్‌లోని దుర్గాభవానీ ఆలయంలో అమ్మవారిని పల్లకీలో మాడవీధుల్లో ఊరేగించి జ్వాలా తోరణ ప్రవేశం గావించారు. నగరంలోని శ్రీ మహాశక్తి ఆలయంలో రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. – కరీంనగర్‌కల్చరల్/విద్యానగర్


