కేంద్ర పథకాల నిధులు మళ్లించొద్దు
కరీంనగర్ పార్లమెంట్‌కు అత్యధిక నిధులు కేటాయింపు
మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయాలి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, దిశ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్
కరీంనగర్: పార్టీలకతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, జిల్లా అభివృద్ధి, కోఆర్డినేషన్– మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో బుధవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి, కోఆర్డినేషన్– మానిటరింగ్ కమిటీ (దిశ)సమావేశం జరిగింది. సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణం అన్నారు. రూ.851 కోట్ల ఎంపీ నిధులను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించామని అన్నారు. హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, సిరిసిల్ల ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని, వైద్యులను నియమించాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు 15వేల సైకిళ్లు ఉచితంగా అందజేశామని, మరో 5 వేల సైకిల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పీఎం శ్రీ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. గన్నేరువరం బ్రిడ్జి, కేంద్రం సేతు బంధన్ పథకం ద్వారా మంజూరు చేసిన కరీంనగర్ ఆర్‌వోబీ పనులు వేగవంతం చేయాలన్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు రోజువారీ నివేదికలు సమర్పించేందుకు ఉచితంగా ట్యాబ్ అందజేస్తామని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించా లని పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు.


