చేతిలో అంతర్గత పోరు!
కరీంనగర్ అర్బన్: అర్బన్ బ్యాంకు ఎన్నికలు కాంగ్రెస్‌లో అంతర్గత పోరుకు వేదికై ంది. నువ్వా.. నేనా అన్నట్లుగా ప్యానెళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికలు పార్టీ గుర్తులతో సంబంధం లేకున్నా అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం పరిపాటి. కానీ ఈసారి బీఆర్‌ఎస్, బీజేపీ ఎన్నికలపై మౌనం పాటిస్తుండగా.. కాంగ్రెస్‌లో మాత్రం వర్గపోరు స్పష్టమవుతోంది. ఎన్నికల ఆరంభంలో తనదే కాంగ్రెస్ మద్దతు ప్యానెల్ అని గడ్డం విలాస్‌రెడ్డి ప్రకటించారు. పార్టీకి ఆది నుంచి సేవలందిస్తున్నానని అనగా.. పార్టీ నుంచి మద్దతు లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ప్యానెల్‌నే ప్రకటించలేదని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మంత్రుల మద్దతుందని చెప్పుకుంటున్నవారి మాటలు నమ్మొద్దని చెబుతున్నారు. కాగా కాంగ్రెస్ పార్లమెంటరీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు మాత్రం మార్పు కోసం మన ప్యానెల్ అంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. నిర్మల భరోసా ప్యానెల్ పేరున కరపత్రికలు ముద్రించగా.. 12 మంది డైరెక్టర్ అభ్యర్థులతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వివాదాల ప్యానెళ్లను ఓడించి విశ్వాసంగా పని చేసే తమ ప్యానెల్‌ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
వెలిచాల వర్సెస్ కవ్వంపల్లి
కాంగ్రెస్‌లో వర్గాలు లేవని నేతలు చెబుతున్నా.. అర్బన్ ఎన్నికల్లో మాత్రం విరుద్ధ పరిస్థితి. వెలిచాల వర్సెస్ కవ్వంపల్లి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాత్రం పార్టీ నుంచి ఎలాంటి ప్యానెల్‌ను ప్రకటించలేదని చెబుతున్నారు. మంత్రులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్నారని, అయినా ఆది నుంచి కాంగ్రెస్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పైచేయి సాధిస్తోందని ధీమా వ్యక్తం చేయగా.. ఎవరికి మద్దతిస్తున్నారో వెల్లడించలేదు. పార్టీ నుంచి ప్యానెల్ లేకపోగా.. తమకు మద్దతుందని ప్రకటించడం ఎంతవరకు సబబని కర్ర రాజశేఖర్ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా డీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నారు. తనది రాజశేఖర్ ప్యానెల్ అని, అన్ని పార్టీల మద్దతుందని కాంగ్రెస్ నేత, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ విస్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. వెలిచాల రాజేందర్‌రావు మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు.
గడ్డం విలాస్ ఒంటరేనా?
అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో నిర్మల భరోసా ప్యానెల్, కర్ర రాజశేఖర్ ప్యానెల్‌ను స్పష్టం చేయగా.. గడ్డం విలాస్‌రెడ్డి ప్యానెల్ ఇప్పటివరకు ప్రకటించలేదు. తానే కాంగ్రెస్ వాదినని, తనకే పార్టీ అండ ఉంటుందని మొదటి నుంచి ధీమా వ్యక్తం చేశారు. బ్యాంకులో జరిగిన అక్రమాలను వెలుగులోకి తేగా.. మాజీ చైర్మన్‌పై ఆరోపణలు గుప్పించారు. కానీ పార్టీ ప్రకటనలో గడ్డం విలాస్‌రెడ్డికి మద్దతు లేకపోగా.. కర్ర రాజశేఖర్ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తమకే అనుకూలిస్తాయని స్వతంత్ర అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


