నాణ్యమైన మొక్క.. ఆదాయం పక్కా
కరీంనగర్ అర్బన్: రైతులకు నాణ్యమైన మొక్కలు అందించడం ద్వారా మంచి ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నారు ఉద్యానశాఖ అధికారులు. ఆయిల్ పాం తోటల్లో నాణ్యత లేని(వంధ్యత్వ) మొక్కలు సరఫరా అవుతుండడంతో కాత, పూత లేక రైతులు ఆదాయం కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో మొక్కల బ్యాగులపై బార్‌కోడ్‌ను ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికీ వెళ్లాయి.. మార్గమధ్యలో పక్కదారి పట్టాయా? అనే వివరాలు తెలిసిపోనుంది. బార్‌కోడ్ ముద్రణతో నాసిరకం బెడద, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది నుంచే కొత్త పద్ధతిని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అక్రమం బట్టబయలు
ఆయిల్‌పాం మొక్కల పంపిణీలో అక్రమాలకు చెక్ పడనుంది. ఆయిల్‌పాం మొక్కలపై బార్‌కోడ్ ముద్రణతో నర్సరీల నుంచి బయటకు వెళ్లినవి అదే రైతుకు వెళ్లాయా? పక్కదారి పట్టాయా? అనేది తెలియనుంది. ప్రస్తుతం రైతులను పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య వంధ్యత్వ మొక్కలు. గత ఐదారేళ్లలో వీటితో చాలా మంది రైతులు నష్టపోయారు. తమకు న్యాయం చేయాలని ఆయిల్‌ఫెడ్‌తో ఎడతెగని పోరాటం చేస్తున్నారు. వంధ్యత్వ మొక్కలతో నష్టపోయిన రైతుల విషయంలో ఆయిల్‌ఫెడ్ చేపడుతున్న నష్టనివారణ చర్యలకు, రైతులు కోరుతున్న న్యాయానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం బార్‌కోడ్ పద్ధతితో రైతులకు మేలు కలుగనుంది. బార్‌కోడ్‌ను స్కాన్‌చేస్తే మొక్కలు ఏ నర్సరీ నుంచి వచ్చాయి.. దాని బ్యాచ్ నంబర్ తదితర వివరాలు క్షణాల్లో తెలిసిపోతాయి. కొద్ది నెలల క్రితం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మలేషియా పర్యటనలో అక్కడి నర్సరీలో మొక్కల పెంపకం, నాసిరకం నివారణకు వారు ఆచరిస్తున్న పద్ధతులు తెలుసుకున్నారు. పర్యటన అనంతరం నర్సరీల పర్యవేక్షణకు ఇంజినీరింగ్ అధికారుల నుంచి తప్పించి, ప్రత్యేకంగా ఉద్యాన శాస్త్రవేత్తను ఓఎస్డీగా నియమించారు. పలు సూచనలతో నర్సరీల్లో పలు మార్పులు చేపట్టారు. ఈక్రమంలోనే నర్సరీలో ఎత్తుతక్కువగా ఉండే 4.5 లక్షల సిరాడ్ రకం పెంచుతున్నారు. మొలకలను కొత్త సంచుల్లోకి మార్చేముందు గ్యానోడెర్మా నివారణకు ట్రైకోడెర్మా విరిడీ, వేప పిండి కలిపిన మట్టిని నింపనున్నారు. దీంతో చిన్నతనం నుంచే ఆయిల్ పామ్ మొక్కల్లో గ్యానోడెర్మా వ్యాధిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. నూతన విధానంతో రైతులకు భద్రత ఉండనుండగా నాణ్యమైన మొక్కలు అందనున్నాయి.


