
జీపీ ట్రాక్టర్ అదుపుతప్పి కార్మికుడు మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామపంచాయతీ ట్రాక్టర్ అదుపుతప్పి కరెంట్ స్తంభానికి ఢీకొని జీపీ కార్మికుడు మృతిచెందిన ఘటన తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బస్వాపూర్‌లో శనివారం రాత్రి జీపీ ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా, ట్రాక్టర్‌పైన ఉన్న మల్టీపర్పస్ వర్కర్ దాచారం భూమయ్య (55), గొడిసెల అనితకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పంచాయతీ కార్యదర్శి వేణు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం భూమయ్యను కరీంనగర్ తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనితకు సిరిసిల్లలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుడు భూమయ్యకు ఇద్దరు భార్యలు, కూతురు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు చందాలు పోగుచేసి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.