
పంటలకు సోలార్ ‘కంచె’
మంథనిరూరల్: ఆరుగాలం కష్టపడి పండించే పంటల రక్షణకు రైతులు అనేక విధాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అటవీ ప్రాంతాలు, గుట్టల సమీపంలోని పంటలను అడవిజంతువుల బారినుంచి రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. కొందరు చేనుల చుట్టూ కరెంట్ వైర్లు అమర్చి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా.. వాటిద్వారా జంతువులే కాదు.. మనుషులు కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన రైతు కొత్త శ్రీనివాస్ వినూత్న ఆలోచనతో పంటను కాపాడుకునేందుకు చేను చుట్టూ సోలార్ పవర్ కంచె ఏర్పాటు చేశాడు.
ఎనిమిదేళ్ల క్రితం..
లక్కేపూర్ గ్రామ శివారు గాజులపల్లి ఎస్సారెస్సీ కాలువ సమీపంలో శ్రీనివాస్‌కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎనిమిదేళ్లక్రితం మంచిర్యాల జిల్లాలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన శ్రీనివాస్.. పంట రక్షణకు సోలార్ కంచె గురించి తెలుసుకున్నాడు. వెంటనే తన చేను చుట్టూ ఏర్పాటు చేశాడు. అడవిజంతువుల బారి నుంచి పంటలు రక్షించుకుంటున్నాడు. మంథని మండలంలో ఇద్దరు, ముగ్గురు రైతులే ఇలా సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వారికి వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తే ప్రాణనష్టం నివారించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
షాక్ మాత్రమే వస్తుంది.. ప్రాణనష్టం ఉండదు..
చేను చుట్టూ ఏర్పాటు చేసే సోలార్ పవర్ కంచెతో షాక్ మాత్రమే వస్తుందని, దీంతో జంతువులు భయపడి దూరంగా వెళ్తాయని రైతులు చెబుతున్నారు. బ్యాటరీ సాయంతో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అది కేవలం షాక్ తగిలేంత వరకే ఉంటుందంటున్నారు. తద్వారా జంతువులే కాదు.. మనుషులకూ ప్రాణనష్టం ఏమీ ఉండదంటున్నారు.
లక్కేపూర్ గ్రామ రైతు వినూత్న ఆలోచన
అడవిజంతువుల బారినుంచి పంటల రక్షణ
అవగాహన పెంచుకుంటే మంచిఫలితాలు

పంటలకు సోలార్ ‘కంచె’