ఆబ్కారీ అస్తవ్యస్తం ! | - | Sakshi
Sakshi News home page

ఆబ్కారీ అస్తవ్యస్తం !

Oct 6 2025 2:48 AM | Updated on Oct 6 2025 2:48 AM

ఆబ్కా

ఆబ్కారీ అస్తవ్యస్తం !

‘వేములవాడ పట్టణానికి సమీపంలో ఒకరు దాదాపు రూ.2లక్షల విలువ చేసే బ్రాండెడ్‌ లిక్కర్‌ను కల్తీ చేసి విక్రయించాడు. మద్యం రుచిలో తేడా రావడంతో మందుబాబుల ఫిర్యాదుతో ఆబ్కారీశాఖ అధికారులు నకిలీ లిక్కర్‌ విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకుని కటకటాలకు పంపారు.’

‘రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్‌లో ఉన్న ఆబ్కారీ వాహనంలో పదుల సంఖ్యలో మద్యం బాటిల్స్‌ ఉన్నాయి. వాటిని దసరా ముందు రోజు బయటకు పంపడానికి కొందరు ఎకై ్సజ్‌ ఉద్యోగులతో ఓ అధికారి ప్లాన్‌ చేశారు. ఇది కాస్త బయటకు తెలిసి వీడియో తీయడానికి పలువురు ప్రయత్నించగా.. వెంటనే ఆ వాహనాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. సీజ్‌చేసిన బాటిల్స్‌ అయితే వాటి వివరాలను ఆబ్కారీ అధికారులు ఎందుకు బహిర్గతం చేయలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.’

సిరిసిల్ల క్రైం: జిల్లాలో ఆబ్కారీశాఖ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. అధికారుల కొరత ఉండడంతో పర్యవేక్షణ కరువైంది. ఎకై ్సజ్‌ అధికారుల పర్యవేక్షణ కరువై జిల్లాలో నకిలీ మద్యం విక్రయాలు, గుడుంబా వ్యాపారాలు జోరందుకున్నాయి. సిరిసిల్ల సర్కిల్‌ సీఐ లేకపోవడంతో ఆ విధులను ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్‌ సీఐకి అప్పగించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల కొరతతో..

ఆబ్కారీ శాఖలో సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, వేములవాడ సర్కిళ్లు ఉన్నాయి. సిరిసిల్ల సర్కిల్‌కు సీఐ లేకపోవడంతో ఎల్లారెడ్డిపేట సీఐ రెండు సర్కిళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా తండాలు, గ్రామాల్లో బెల్ట్‌షాపులు, గుడుంబా తయారీ నియంత్రణపై పట్టు కోల్పోయారు. ఒక్కో ఊరికి ఐదేసి బెల్ట్‌షాపులు నడుస్తున్నా పర్యవేక్షణ కరువైంది.

హడావుడి..యథాతథం

ఆబ్కారీ విభాగంపై విమర్శలు రాగానే తండాల పరిశీలనలు, బెల్లం పానకం ధ్వంసం, నాటుసారా పాత్రలు స్వాధీనం చేసుకుంటూ హల్‌చల్‌ చేస్తున్నారు. కానీ కొద్ది రోజులకే మళ్లీ యథాతథ స్థితికి చేరుకుంటున్నాయి. ఒకటి, రెండు ఫొటోలు తీసి మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.

ఆబ్కారీ జీపులో మద్యం బాటిల్స్‌

దసరా పండుగ ముందు రోజు ఆబ్కారీశాఖ వాహనంలో మద్యం బాటిల్స్‌ కనిపించడం కలకలం రేపింది. వాటిని సీజ్‌ చేసిన బాటిల్స్‌ అని అధికారులు చెబుతున్నా వాస్తవం అది కాదనే ప్రచారం జరుగుతోంది. పండుగ కోసం కావాలనే జిల్లాలోని పలు వైన్‌షాపుల వద్ద వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

కలెక్టరేట్‌ సెల్లార్‌లో బాటిల్స్‌ నిల్వ!

ఆబ్కారీ అధికారి తన జీపులో పెట్టి నేరుగా కలెక్టరేట్‌ సెల్లార్‌లో దాచినట్లు సమాచారం. విషయం మీడియాకు తెలియడంతో ఆ అధికారి వాహనాన్ని అధిక వేగంతో అక్కడి నుంచి తరలించారన్న వీడియోలు వైరల్‌గా మారాయి. సీజ్‌ చేసిన బాటిల్స్‌ అయితే అవి శాఖ కార్యాలయంలో ఉండాలి. నిర్ణీతకాలం తర్వాత ధ్వంసం చేయాలి. కానీ ప్రస్తుత అధికారులు వాటిని రీసేల్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతటి ఆరోపణలపై విచారణ జరిపే అధికారి లేకపోవడంతో అవినీతి మూలాలు బలపడుతున్నాయి. అసలు వాహనంలో మద్యం బాటిల్స్‌ ఎక్కడివనే కోణంలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కొందరు చేసిన తప్పుకి ఆబ్కారీశాఖలో అందరిపై ఆరోపణలు బాధ కలిగిస్తున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

అరకొరగా అధికారులు

కొరవడుతున్న పర్యవేక్షణ

మొన్న నకిలీ మద్యం తయారీ దందా

ఎకై ్సజ్‌ వాహనంలోనే మందుబాటిల్స్‌

సీజ్‌ చేసిన బాటిల్స్‌ రీ సేల్‌?

విచారణ చేపట్టాలని డిమాండ్‌

ఆబ్కారీ అస్తవ్యస్తం !1
1/1

ఆబ్కారీ అస్తవ్యస్తం !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement