బావిలో పడి మెకానిక్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

బావిలో పడి మెకానిక్‌ మృతి

Oct 6 2025 2:48 AM | Updated on Oct 6 2025 2:48 AM

బావిల

బావిలో పడి మెకానిక్‌ మృతి

బావిలో పడి మెకానిక్‌ మృతి చెరువులో పడి యువకుడు.. అనుమానాస్పదంగా వివాహిత.. రౌడీషీటర్‌ అరెస్ట్‌

మల్యాల: మోటారు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మెకానిక్‌ మృతిచెందిన సంఘటన మండలంలోని మ్యాడంపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్‌కుమార్‌ కథనం ప్రకారం.. మ్యాడంపల్లికి చెందిన ఓ రైతు వ్యవసాయ మోటారు మరమ్మతుకు రాగా.. అదే గ్రామానికి చెందిన మెకానిక్‌ వూకంటి శ్రీపాల్‌ రెడ్డి (47) మరమ్మతు చేసేందుకు వెళ్లాడు. అక్కడ కాలుజారి బావిలో పడ్డాడు. నీటిలో మునిగి మృతి చెందాడు. శ్రీపాల్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

జమ్మికుంట: జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. జమ్మికుంట టౌన్‌ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. కోరపల్లికి చెందిన పీట్ల రాజశేఖర్‌(28) కొంతకాలంగా పిట్స్‌తో బాధపడుతున్నాడు. ఆదివారం గ్రామ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో పిట్స్‌ వచ్చి చెరువులో పడి చనిపోయాడు. రాజేశేఖర్‌ తల్లి కేశమ్మ ఫిర్యాదుతో కేసు నమోదుచేశామని సీఐ తెలిపారు.

కరీంనగర్‌రూరల్‌: తీగలగుట్టపల్లిలోని విద్యారణ్యపురికాలనీకి చెందిన ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని కరీంనగర్‌ రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరుకు చెందిన రంగస్వామికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడున్నారు. పెద్ద కూతురు చంద్రకళ(35)కు ఆదిలాబాద్‌కు చెందిన సిరిపురం సంతోష్‌తో వివాహం జరిపించాడు. కొన్నాళ్ల తరువాత కుటుంబంలో గొడవల కారణంగా దంపతులు ప్రస్తుతం తీగలగుట్టపల్లిలోని విద్యారణ్యపురికాలనీలో నివాసముంటున్నారు. చంద్రకళకు శనివారం అర్ధరాత్రి ఫిట్స్‌ వచ్చింది. భర్త సంతోష్‌ చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. సరైన చికిత్స చేయడం లేదనే కారణంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన కూతురు మృతిపై అనుమానాలున్నాయనే తండ్రి రంగస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

విషజ్వరంతో మహిళ..

రామగిరి(మంథని): మండలంలోని పన్నూర్‌ గ్రామానికి చెందిన చిందం శారద(38) విషజ్వరంతో ఆదివారం వేకువజామున మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. శారద పదిరోజుల నుంచి విషజ్వరంతో బాధపడుతూ కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలికి భర్త శంకర్‌, కూతురు ఉన్నారు. భర్త గ్రామపంచాయతీ కార్యాలయంలో పంపు ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.

కారు ఢీకొని వృద్ధురాలు..

ధర్మపురి: కారు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని నక్కలపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భగ్గి లక్ష్మి (65) ఆదివారం సాయంత్రం పనులు పూర్తిచేసుకుని ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను 108లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. లక్ష్మి కొడుకు సతీశ్‌ నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఆమె భర్త కూడా గతంలో చనిపోయాడు. ఒంటరిగా ఉంటున్న ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని విద్యానగర్‌కు చెందిన కాశెట్టి శ్రీధర్‌పై దాడి చేసిన రౌడీషీటర్‌ జువ్వాడి దీక్షిత్‌ను అరెస్ట్‌ చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపారు. దీక్షిత్‌ ఈనెల 3న విద్యానగర్‌లోని రామాలయం వద్ద శ్రీధర్‌పై దాడి చేసి గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుప్రియ కేసు నమోదు చేశారు. నిందితుడిని ఆదివారం అరెస్ట్‌ చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

వాహనం ఢీకొని ముగ్గురికి గాయాలు

పెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట గ్రామంలో ఆదివారం టాటా ఏస్‌ వాహనం ఢీకొని ముగ్గురు గాయపడినట్లు ఎస్సై కిరణ్‌ కుమార్‌ తెలిపారు. గ్రామానికి చెందిన జంగిలి నిరంజన్‌, ఆరెల్లి అక్షయ్‌, ఊట్ల మధు కరీంనగర్‌ వెళ్లేందుకు బస్‌స్టాప్‌లో బస్‌ కోసం వేచి చూస్తున్నారు. పెగడపల్లి నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న టాటా ఏస్‌ డ్రైవర్‌ జక్కుల ఓదెలు అతివేగంతో నడుపుతూ నిరంజన్‌, అక్షయ్‌, మధును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌ తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

బావిలో పడి మెకానిక్‌ మృతి1
1/1

బావిలో పడి మెకానిక్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement