
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే
మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏలేటి శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్‌కు చెందిన శ్రీధర్ తన ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం మెట్‌పల్లి వచ్చాడు. తిరిగి వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో సమీపంలోని హోటల్‌లో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి టీ తాగుతున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గమనించి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీధర్‌ను పరీక్షించి తర్వాత ఆటోలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందించారు.
వ్యక్తి ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): ఉపాధి కరువై.. మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై అనిల్‌కుమార్ తెలిపిన వివరాలు. గంభీరావుపేట మండలం ముచ్చర్లకు చెందిన కోల సతీశ్(39) ఇంట్లో ఆదివారం చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లివచ్చిన సతీశ్‌కు స్వగ్రామంలో సరైన పని లభించలేదు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో భార్య జ్యోతి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుని భార్య జ్యోతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో దర్జీ..
సిరిసిల్ల క్రైం: వృత్తి కలిసిరాక.. కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపానికి గురైన సిరిసిల్లకు చెందిన దర్జీ స్వర్గం రమేశ్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న రమేశ్ చాలా ఏళ్లు టైలర్ పనిచేశాడు. కాలక్రమంలో బట్టలు కుట్టించుకునేవారు తక్కువయ్యారు. దీనికితోడు కుటుంబ పోషణకు అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక సొంతింటిని అమ్మేసి అత్తగారి ఇంటి వద్ద భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఇప్పటికే రూ.20లక్షలు అప్పు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం తెల్ల్లవారు జామున ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య సంధ్య బీడీ కార్మికురాలు కాగా వీరికి కూతురు నిహారిక(13), కొడుకు మదన్(11) ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గోదావరిఖని(రామగుండం): స్థానిక మార్కండేయకాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి గంట వెంకటేశ్వర్‌రెడ్డి(85) ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. వెంకటేశ్వర్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ సింగరేణి ఆసుపత్రిలో రెగ్యులర్‌గా చికిత్స చేయించుకుంటున్నాడు. ఆదివారం వేకువజామున కడుపులో నొప్పి వస్తోందని కుమారునికి చెప్పగా, అతను బట్టలు మార్చుకుని వస్తానని ఇంట్లోకి వెళ్లిన సమయంలో వెంకటేశ్వర్‌రెడ్డి భవనం పైకి ఎక్కి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనారోగ్యంతో ఒకరు..
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ఉప్పరిపేటకు చెందిన మానుక మహేశ్ (46) అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. మహేశ్ కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. మరోవైపు ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై ఈనెల 3న ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేశ్ భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే