
దాచుకున్న డబ్బు ఇవ్వరా?
కరీంనగర్: ఇలాంటి సమస్యలు ఏ ఒక్కరిద్దరివో కావు 20 నెలలుగా పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో పిల్లలకు పెళ్లిళ్లు చేయలేక, పెద్ద చదువులు చదివించలేక అనారోగ్యానికి చికిత్స చేయించుకోలేక, చేతిలో చిల్లిగవ్వలేక బాధ పడుతున్నారు. దాచుకున్న డబ్బు ఒక్కొక్కరికి రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రావాల్సి ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వ లేక రిటైర్డు ఉద్యోగులు ఆందోళన బాటకు సిద్ధం అవుతున్నారు.
20 నెలలుగా ఎదురుచూపులు
30ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగం చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. సర్వీసులో ఉన్నంత కాలం వివిధ రూపాల్లో ప్రభుత్వం వద్ద దాచుకున్న సొమ్ముతో పాటు జీపీఎఫ్, పీఎఫ్ సమయానికి అందకపోవడంతో ఆందోళనబాట పట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంవత్సరం సమయం ఇస్తే రిటైర్డు ఉద్యోగులందరి డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 7న ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల వద్ద ఆందోళన, ఈనెల రెండోవారంలో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం రిటైర్డు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(రేవా)ఉమ్మడి జిల్లాశాఖ కార్యవర్గాన్ని ఏర్పర్చుకుని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. రెండుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్నారు.
మాటలు నీటిమూటలేనా
గత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రిటైర్డు ఉద్యోగులకు పదవీవిరమణ రోజే బెనిఫిట్స్ అందజేసి ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దించాలని పలు వేదికల మీద మాట్లాడిన మాటలు నీటిమూటలేనా అంటూ రిటైర్డు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 మార్చి నెల నుంచి ఇప్పటి వరకు రిటైర్డు అయినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, కమిటేషన్, ఈఎల్స్, అఫ్ పే లీవ్, సరెండర్ లీవ్స్, జీపీఎఫ్, డీఎస్‌జీ ఎల్‌ఐసీ, జీఐఎస్, పీఆర్‌సీ ఎరియర్స్, సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి సరెండర్ లీవ్స్, తదితర బిల్లులు మొత్తం జీపీఎఫ్ ఆధారంగా ఒక్కొక్కరికి దాదాపు రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు రావాల్సి ఉంది. 20నెలలుగా ఏ ఒక్కరికి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడంతో కొంత మంది రిటైర్డు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ఎనిమిది వారాల్లో బెనిఫిట్స్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు.
రిటైర్డు ఉద్యోగుల ఆందోళన బాట
ఈనెల 7న కలెక్టరేట్ ఎదుట ధర్నా
రెండోవారంలో ‘చలో హైదరాబాద్’