
టార్గెట్.. గార్బెజ్ ఫ్రీ సిటీ
చెత్త రహితమైతేనే ఆర్థిక సంఘం నిధులు నగరంలో 36 చోట్ల గార్బెజ్ పాయింట్ల తొలగింపు రోడ్లపై చెత్త వేయడంపై బల్దియా సీరియస్ కమాండ్ కంట్రోల్ ద్వారా గుర్తించి ఇంటికే రశీదు
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్‌ను చెత్త రహిత నగరంగా మార్చే దిశగా నగరపాలకసంస్థ అడుగులు వేస్తోంది. గార్బెజ్ ఫ్రీ సిటీగా ర్యాంక్ సాధిస్తేనే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశమున్నందున చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతీ ఇంటినుంచి నుంచి చెత్తను సేకరించి ఆటోల్లో తరలిస్తుండగా, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గార్బెజ్ పాయింట్లు ప్రధాన సమస్యగా మారాయి. దీంతో ఆ పాయింట్లు తొలగించి, వందశాతం చెత్త సేకరణకు నిర్ణయించింది. రోడ్లపై చెత్త పడవేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గుర్తించి, ఇంటికే జరిమానా రశీదు పంపించే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది.
గార్బెజ్ పాయింట్లే ప్రధాన సమస్య
నగరంలో గతంలో ఏర్పాటు చేసిన గార్బెజ్ పాయింట్లు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనిపించడానికి ఈ పాయింట్లే కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే ఇండ్లు, వ్యాపార వాణిజ్య సంస్థల నుంచి స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు చెత్తను సేకరించి డంప్‌యార్డ్‌కు తరలిస్తున్నాయి. ఇందుకోసం యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు యూజర్ చార్జీలు తప్పించుకునేందుకు చెత్తను తీసుకొచ్చి గార్బెజ్ పాయింట్ల వద్ద పడేస్తున్నారు. కొన్ని చోట్ల జంతు వ్యర్థాలు కూడా వేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు ఇటీవల నగరపాలకసంస్థ ఆయా పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటిని నగరపాలకసంస్థ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసింది. అక్కడి నుంచి గార్బెజ్ పాయింట్ల వద్ద చెత్త పడవేస్తున్న వాహనాలను గుర్తించి, వారికి జరిమానా విధిస్తున్నారు. వాహనాల నంబర్ల ఆధారంగా ఇండ్లకే జరిమానా రశీదులు పంపిస్తున్నారు.
రిక్షాల సమయంలో కలెక్షన్ పాయింట్లు
ఒకప్పుడు స్వచ్ఛ ఆటోలు లేని సమయంలో, రిక్షాలు ఉన్నప్పుడు ఈ గార్బెజ్ పాయింట్లు (సెకండరీ కలెక్షన్ పాయింట్లు) ఏర్పాటు చేశారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను రిక్షాలు ఆ కలెక్షన్ పాయింట్ల వద్ద వేస్తే అక్కడి నుంచి ఇతర వాహనాల ద్వారా డంప్‌యార్డ్‌కు తరలించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నగరంలోని 66 డివిజన్లకు గాను 120కి పైగా స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి, డంప్‌యార్డ్‌కు తరలిస్తున్నాయి. దీంతో గార్బెజ్ పాయింట్ల అవసరం లేకుండా పోయింది. యూజర్‌చార్జీలు ఎగవేసే వ్యాపారులకు మాత్రమే ఈ గార్బెజ్ పాయింట్లు ఉపయోగపడుతున్నాయి.
36 పాయింట్లు ఎత్తివేత
నగరంలో సమస్యగా మారిన చెత్త కలెక్షన్ పా యింట్లను నగరపాలకసంస్థ ఎత్తివేస్తోంది. బస్ స్టేషన్, అంబేడ్కర్ స్టేడియం, కశ్మీర్‌గడ్డ, వావి లాలపల్లి, పాతమున్సిపల్ గెస్ట్‌హౌస్, సుభా ష్‌నగర్ ఎస్సీ హాస్టల్, ఆదర్శనగర్, కూరగాయ ల మార్కెట్, ఎన్‌ఎన్ గార్డెన్, రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్, హౌసింగ్‌బోర్డుకాలనీ, ప్రవిష్ట, చైతన్యపురి, శాతవాహన యూనివర్సిటీ, శివ థియేటర్, రాంనగర్, పద్మనగర్ తదితర 36 చోట్ల ఉన్న గార్బెజ్ పాయింట్లను తొలగిస్తున్నారు. అక్కడ చెత్త పడవేయకుండా ఫెన్సింగ్ నిర్మించారు. స్వచ్ఛతకు గుర్తుగా పూలకుండీలు ఏర్పా టు చేశారు. గార్బెజ్ పాయింట్లు ఎత్తివేస్తుండడంతో, రోడ్లపై వెళ్లే వాళ్ల కోసం టూ బిన్స్‌ను ఉపయోగిస్తున్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు రెండు రకాల డబ్బాలను నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
చెత్త వేస్తే చిత్తే
చెత్త వేస్తే కఠిన చర్యలు
కలెక్షన్ పాయింట్లు, రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గార్బెజ్ పాయింట్ల వద్ద చెత్తను వేస్తే కమాండ్ కంట్రోల్ ద్వారా గుర్తించి జరిమానా విధిస్తాం. స్వచ్ఛ ఆటోలకు మాత్రమే తడి, పొడి చెత్తగా అందించాలి. చెత్త రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలి.
– ప్రఫుల్‌దేశాయ్, నగరపాలకసంస్థ కమిషనర్
రోడ్లపై చెత్త పడవేసే వారిపై నగరపాలకసంస్థ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు చూసీ చూడనట్లుగా ఉన్నా, ఇకనుంచి ఆ పరిస్థితి ఉండదని హెచ్చరిస్తోంది. నగరంలోని కీలక ప్రాంతాల్లోని 16 గార్బెజ్ పాయింట్ల వద్ద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. కమాండ్ కంట్రోల్ ద్వారా ఉదయం 5 గంటల నుంచి 16 గార్బెజ్ పాయింట్లను పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ప్రతి రోజు ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఒక జవాన్ కమాండ్ కంట్రోల్‌లో ఉండనున్నారు. ఎక్కడ చెత్త వేసినట్లు కనిపించినా, వారిని గుర్తించి జరిమానా విధిస్తున్నారు. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో పడవేస్తున్న చెత్తను ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులు తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు.

టార్గెట్.. గార్బెజ్ ఫ్రీ సిటీ

టార్గెట్.. గార్బెజ్ ఫ్రీ సిటీ

టార్గెట్.. గార్బెజ్ ఫ్రీ సిటీ