మారిందా? | - | Sakshi
Sakshi News home page

మారిందా?

Sep 25 2025 2:12 PM | Updated on Sep 25 2025 2:12 PM

మారిం

మారిందా?

● ఎలగందల్‌ ఫైరింగ్‌ రేంజ్‌ నుంచి బోనాలపల్లె మీదకు బుల్లెట్లు ● టార్గెట్‌ని తాకి దిశ తప్పి గ్రామం వైపు తూటాల ప్రయాణం ● అమృతమ్మను తాకింది ఎస్‌ఎల్‌ఆర్‌ తూటాగా నిర్ధారణ ● ఫైరింగ్‌ రేంజ్‌లో వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్‌ ● బాలిస్టిక్‌ ఎక్స్‌పర్ట్‌లు వస్తేనే వాస్తవాలు వెలుగులోకి

బోనాలపల్లెలో ఏం జరుగుతోంది?

తూటా దిశ

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

తుపాకీ నుంచి తూటా బయటికి వచ్చిన తరువాత.. టార్గెట్‌ వైపునకు దూసుకుపోతుంది. టార్గెట్‌ను తాకిన తరువాత దాని వేగం ఆగదు. కానీ, దిశ మార్చుకుని అదే వేగంతో మరింత ముందుకు దూసుకుపోతుంది. ఎలగందుల ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో ఉన్న బోనాలపల్లె వైపునకు దూసుకుపోతున్న పోలీసు తూటాల విషయంలో సరిగ్గా ఇదే జరిగిందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. తూటా ప్రయాణంలో ఉండగా.. దిశ మార్చుకోవడం సహజంగా జరిగేదే అని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే బోనాలపల్లెలోని వృద్ధురాలు అమృతమ్మకు తగిలిన తూటా, అంతకుముందు అక్కడి ఇళ్ల పైకప్పుల నుంచి లోనకు దూసుకువచ్చిన బుల్లెట్లు కూడా ఇదే విధంగా వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బోనాలపల్లెలో అమృతమ్మను తాకింది ఎస్‌ఎల్‌ఆర్‌ నుంచి వచ్చినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

బుల్లెట్‌ రికేషే

బుల్లెట్‌ను తుపాకీ నుంచి పేల్చిన తరువాత లక్ష్యం వైపు దూసుకుపోతుంది. టార్గెట్‌ మనిషి లేదా జంతువు ఇంకేదైనా మెత్తని ఉపరితలం అయితే.. దాన్ని చీల్చుకుంటూ వెళ్తుంది. లక్ష్యానికి కలిగే నష్టం బుల్లెట్‌ ప్రయాణించిన దూరం మీద ఆధారపడి ఉంటుంది. నునుపు లేదా గరుకు ఉపరితలలాను సమీపం నుంచి బుల్లెట్‌ తాకినపుడు అది తాకిన కోణం ఆధారంగా దిశ తప్పకుండా మార్చుకుని మరో దిశకు దూసుకుపోతుంది. దీన్నే సాంకేతిక భాషలో ‘బుల్లెట్‌ రికేషే’ అని పిలుస్తారు. ఉదాహరణకు తుపాకీ నుంచి వెలువడిన ఒక బుల్లెట్‌ 15 నుంచి 45 డిగ్రీల కోణంలో ఉపరితలాన్ని తాకినప్పుడు అది తన దిశను మార్చుకునేందుకు అధిక అవకాశాలు ఉన్నాయని సినీయర్‌ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో 70 నుంచి 90 డిగ్రీల కోణంలో గరుకు ఉపరితలాన్ని బుల్లెట్‌ తాకినప్పుడు అది తిరిగి వచ్చి కాల్చిన వ్యక్తి శరీరంలోకే దూసుకు వెళ్లే ప్రమాదముందని స్పష్టంచేస్తున్నారు.

బోనాలపల్లె వైపునకు బుల్లెట్లు దూసుకువస్తున్న విధానంపై స్థానిక పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. శిక్షణలో ఉన్న పోలీసులకు ఉన్నతాధికారులు పాయింట్‌22, 303, సెల్ఫ్‌ లోడెడ్‌ రైఫిల్‌ (ఎస్‌ఎల్‌ఆర్‌), ఏకే–47, పిస్టల్‌, కార్బన్‌ తదితర అన్ని రకాల తుపాకులతో సాధన చేయిస్తారు. ఏ తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్‌ అయినా సగటున గంటకు 4,300 కిమీలకుపైగా వేగంతో ప్రయాణిస్తుంది. ఎలగందుల ఫైరింగ్‌రేంజ్‌లో టార్గెట్‌ బోర్డులను తాకి వెనక ఉన్న కొండ రాళ్లను తాకుతున్నాయి. కాల్చిన తూటాల్లో చాలామట్టుకు అక్కడే ఆగిపోతాయి. కొన్ని తూటాలు రాళ్ల ఉపరితలం అంచును తాకి దిశను మార్చుకుని బోనాలపల్లె వైపుకు దూసుకొస్తున్నాయి. గతంలోనూ ఇలా తూటాలు దూసుకువచ్చాయి. కానీ, ఆ సమయంలో మైనింగ్‌ లేకపోవడంతో గుట్ట ఎత్తు అధికంగా ఉండేది. దీంతో అక్కడే ఆగిపోయేవి. ఈ మధ్య ఎత్తు తగ్గడంతో బోనాలపల్లె వరకు బుల్లెట్లు ప్రయాణిస్తున్నాయి. ఇలా దిశ మార్చుకున్న తూటాలు కూడా ప్రాణాంతకమే అని పలువురు పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌ నుంచి బాలిస్టిక్‌ ఎక్స్‌పర్ట్స్‌ టీం వచ్చి అధ్యయనం చేసిన అనంతరం మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మారిందా?1
1/1

మారిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement