
పండుగ పూట పస్తులేనా?
కరీంనగర్: బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తున్న వేళ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, గ్రామపంచాయతీల్లోని మల్టీపర్పస్ కార్మికులు, కారోబార్లు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు 3 నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో పండుగ పూట పస్తులేనా అంటూ వాపోతున్నారు.
కాగితాలకే పరిమితం
జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు పెంచిన వేతనం కాగితాలకే పరిమితమైంది. జీతాల చెల్లింపుల విషయంలో జవాబుదారీగా ఎవరూ ఉండడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో తొలిమెట్టు అయిన గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లు 3 నెలలుగా వేతనాలు రాక పండుగ పూట పస్తులేనా అంటూ దిక్కులు చూస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల్లోని 313 గ్రామ పంచాయతీల్లో 1,460 మంది మల్టీపర్పస్ కార్మికులు పని చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు, వాటర్‌మెన్, ఎలక్ట్రిషియన్, ట్రాక్టర్ డ్రైవర్, కారోబార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో పంచాయతీలో సగటున నలుగురు కార్మికులు పని చేస్తున్నారు. నెలకు రూ.9,500 చొప్పున వీరికి వేతనంగా చెల్లిస్తున్నారు.
పంచాయతీలకు ఆదాయమిలా..
జిల్లావ్యాప్తంగా జనాభాలో ఒక్కొక్కరికి రూ.166 చొప్పున కేంద్ర ఆర్థిక సంఘం పంచాయతీలకు నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం రూ.115 చొప్పున మాత్రమే చెల్లి స్తోంది. ఈ లెక్కన ప్రతి నెల జిల్లాకు రూ.8.75కోట్ల నిధులు రావాల్సి ఉంటుంది. ఇవికాకుండా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.కోటి5లక్షలు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.62లక్షలు రావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఎస్‌ఎఫ్‌సీ నిధులు వీటికి అదనం. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది.
3 నెలలుగా నిధుల్లేవు..
ప్రభుత్వ నిధులు రాకపోవడంతో పంచాయతీల్లో పాలన కుంటుపడుతోంది. కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. గతంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనాలను చెల్లించేందుకు అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఖర్చులకు వాడుకొని అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తుండడంతో.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను జీతాల కోసం వాడుకునే అవకాశం లేకుండా నిబంధనలు సవరించారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను విడుదల చేయాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. మూడు నెలల కార్మికుల వేతనాల బకాయిలు సుమారు రూ.6కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 683 మంది స్కావెంజర్లకు 3 నెలల వేతనాలు రావాల్సి ఉంది. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు సైతం వేతనాలు అందకపోవడంతో వారి వెతలు వర్ణనాతీతం. జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న 240 మంది కారోబార్లదీ అదే పరిస్థితి.
రాష్ట్ర ప్రభుత్వం చిరుద్యోగుల వేతనాలు నెలలుగా చెల్లించకపోవడంతో అనేక ఇక్కట్లపాలవుతున్నారు. గ్రీన్‌చానల్ ద్వారా నెలనెలా వేతనాలు చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ నిలబెట్టుకోవాలి. బతుకుదెరువు కోసం 24 గంటలపాటు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలను నెలనెలా చెల్లించాల్సిందే.
– కొప్పుల శంకర్, జీపీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి