
ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ..
● టవర్ ఎక్కిన అడవిశ్రీరాంపూర్ మహిళలు
మంథని: ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరిగాయని మంగళవారం మహిళలు, గ్రామస్తులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమకు తొలిజాబితాలో ఉన్న పేర్లను తొలిగించి ఇతరులకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలో తమపేర్లు మాయంకావడంతో కలెక్టర్, స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా సమాధానం రాలేదన్నారు. దీంతోనే తాము నిరసనకు దిగామని బాధితులు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తమపేర్లను తొలిగించి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దడంతో బాధితులు టవర్ దిగారు.
ధర్మపురి: ఇంటిపై పిడుగు పడడంతో డాబాపైన ఉన్న పిల్లర్ ధ్వంసమైంది. ఇంట్లో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పింది. బాధితుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గ్రామానికి చెందిన వడ్లూరి సత్యం ఇంటిపై పిడుగు పడింది. భారీ శబ్దం రావడంతో ఇంట్లోనివారు పైకి వెళ్లి చూశారు. పిల్లర్ ముక్కలై కనిపించింది. ఇంట్లో ఐదురుగురు ఉండగా.. ప్రాణాపాయం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇదే గ్రామం పరిధిలోని లంబాడీతండాలోని ఓ మైదానంలో పిడుగు పడిందని గ్రామస్తులు తెలిపారు.
శంకరపట్నం: మండలంలోని అర్కండ్ల వాగులో ఓ వ్యక్తి మంగళవారం కొట్టుకుపోయి...ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు... అర్కండ్ల వాగు లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా వీణవంక మండలం నుంచి వస్తున్న ఓ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా వరద ప్రవాహంలో కొంతదూరం కొట్టుకుపోయా డు. అనంతరం ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. ఆ వ్యక్తిని పలకరించినా మాట్లాడకుండా వీణవంక మండలం చల్లూరు వైపు వెళ్లాడని తెలిపారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని కొత్తబస్టాండ్ ప్రాంగణంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన పత్రి తిరుపతి, బుగ్గారం మండలం వెల్గొండకు చెందిన ఎట్టెం రాములు 200 గ్రాముల గంజాయిని ఆర్టీసీ బస్సులో జగిత్యాలకు తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం విక్రయించేందుకు సిద్ధమవుతుండగా ఎస్సై రవికిరణ్ వారిని పట్టుకుని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.