
ఇక స్వచ్ఛతాహీ సేవా
కరీంనగర్‌రూరల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు బుధవారం నుంచి గ్రామాల్లో స్వచ్ఛతా హీ సేవా – 2025 కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అక్టోబరు 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు చేపడతారు. స్వచ్ఛ భారత్ మిషన్ రూపొందించిన స్వచ్ఛతా హీ సేవా ప్రచార వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అశ్విని వాకడే, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇన్‌చార్జి డీఆర్‌డీవో శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు.
కార్యక్రమాల నిర్వహణ ఇలా..
● 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు చెత్త ఉన్న ప్రాంతాలను ఫొటో తీయాలి. దానిని తొలగించాక మరో ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
● 17నుంచి 20 వరకు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు తదితర ప్రజా స్ధలాల్లోని చెత్త తొలగించాలి. విద్యార్థులతో స్వచ్ఛత ర్యాలీలు, ప్రతిజ్ఞ, మానవహారం నిర్వహించాలి. పనికిరాని వస్తువులతో బొమ్మలు, అలంకరణ వస్తువుల తయారీ తదితర కార్యక్రమాలు చేపట్టి ఫొటోలు తీయాలి.
● 18 నుంచి 24 వరకు సఫాయి మిత్ర సురక్ష ద్వారా పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఆరోగ్య, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలి. సంక్షేమ పధకాలు వర్తింపచేయాలి, సన్మానం చేయాలి.
● 25న ఏక్ దిన్, ఏక్‌సాధ్, ఏక్ గంటలో భాగంగా గ్రామస్తులు శ్రమదానం ద్వారా ప్రజాస్ధలాల్లోని చెత్త తొలగించాలి.
● 21 నుంచి అక్టోబరు 2వ తేదీవరకు క్లీన్, గ్రీన్ ఉత్సవ్ పేరిట సింగిల్‌యూస్ ప్లాస్టిక్ రహిత ఉత్సవాలు నిర్వహించాలి. ఉత్సవ మండపాలు, ముగ్గులతో అలంకరణ చేయాలి. ఫొటోలు తీయాలి.