
కార్మికుల సమస్యలపై పోరాటం
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసేందుకు సిద్ధమని, అందుకు కార్మికులంతా తనకు అండగా నిలవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ టీజీఎన్‌పీడీసీఎల్ డిస్కం నూతన సెక్రటరీ సల్వాజి వెంకట రమణారావు తెలిపారు. యూనియన్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికై న ఆయనను మంగళవారం కరీంనగర్‌లోని యూనియన్ కార్యాలయంలో అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు సన్మానించారు. అంతకుముందు నగరంలో భారీర్యాలీ నిర్వహించి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌వీ రమణ మాట్లాడుతూ జిల్లాకు చెందిన కొంతమంది ద్రోహం కారణంగా రాష్ట్ర అధ్యక్షపదవి చేజారిందని, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు యూనియన్ కార్యకలాపాలతో ఏ సంబంధమని, ఇకనైనా స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హితువు పలికారు. సమస్య చిన్నదా, పెద్దదా అని చూడకుండా కార్మికుల ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గతంలోని కొంతమంది నాయకులు కార్మికుల సమస్యలు గాలికొదిలి వ్యక్తిగత సమస్యలపై దృష్టిసారించడంతో కార్మికుల సమస్యలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ విజయోత్సవ సభలో జిల్లా కార్యదర్శి సీహెచ్ భాస్కర్, ప్రాంతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కన్నం నర్సింగ రావు, అడిషనల్ సెక్రటరీ రమణా రెడ్డి, సలహదారు సాన జయకర్, వివిధ డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు జి.సురేఖ, మల్లేశం, శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, మోతే శ్రీనివాస్, శంకర్, రంగు వెంకటనారాయణ, రాష్ట్ర, కంపెనీ నాయకులు, మహిళలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.