ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే! | - | Sakshi
Sakshi News home page

ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే!

Sep 14 2025 3:21 AM | Updated on Sep 14 2025 3:21 AM

ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే!

ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే!

బాధితులకు బెదిరింపులు..

ప్రభుత్వ ఉద్యోగులకు బ్లాక్‌మెయిల్‌

క్రిప్టో సూత్రధారి తీరు

ప్రత్యేక కోర్టు ద్వారా విచారణకు పోలీసుల చర్యలు

నిందితుల ఆస్తులు అటాచ్‌కు సీపీ కసరత్తు

కట్ల సతీశ్‌ను బహిష్కరించేందుకు సిఫారసు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సంచలనం రేపిన మె టా క్రిప్టో కరెన్సీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ వ్యవహారంలో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కార్పొరేటర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కట్ల సతీశ్‌ను పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కీలక నిందితులుగా ఉన్న దాసరి రాజు, దాసరి రమేశ్‌, బూర శ్రీధర్‌, తులసీ ప్రకాశ్‌ను సీసీఎస్‌ పోలీసులు అదే రోజు ఉదయం అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే క్రిప్టోలో అధికలాభాలు అంటూ ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.100 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

లాభాల ఆశచూపి..

అధికలాభాల ఆశచూపగానే పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వ టీచర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. వీరిని గతేడాది పలుమార్లు బ్యాంకాక్‌, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాలకు తీసుకెళ్లారు. ఇలా దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేశారని, ఈ డబ్బుతో సూత్రధారుల్లో లోకేశ్‌ అనే వ్యక్తి ద్వా రా దుబాయ్‌ తదితర దేశాల్లో పలు వ్యాపారాలు స్థాపించారని బాధితులు ఆరోపించారు. ‘నష్టపోయాం మహాప్రభో.. మా డబ్బులు మాకివ్వాలని’ బాధితులు కోరినా.. ఎవరికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను వేధించేందుకు లీగల్‌ టీంను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు.

బెదిరింపులు... బ్లాక్‌మెయిల్‌

మెటా క్రిప్టోలో చేరిన వారిలో సాధారణ వ్యక్తులు నిలదీస్తే కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేశారు. దీనికి కొందరు పోలీసులు కూడా సహకరించడం గమనార్హం. బాధితులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే బ్లాక్‌మెయిల్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విదేశాలకు వెళ్తే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ...అది ఎక్కడా జరగలేదు. అంతేకాదు వారికి విదేశాల్లో అమ్మాయిలతో మసాజ్‌లు చేయించి వారి వీడియోలు దగ్గర పెట్టుకున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వమని అడిగితే.. ‘నా మీద కేసులు పెడితే.. మీరు అక్రమంగా విదేశాలకు వెళ్లడం, అక్కడ చేసిన పనుల మీద ఎదురుకేసులు పెట్టాల్సి వస్తుందని’ బెదిరింపులకు దిగారు.

ఏయే చట్టాల కింద కేసు పెట్టారంటే?

మాజీ కార్పొరేటర్‌ కట్ల సతీశ్‌ మాటలు నమ్మి నూనావత్‌ భాస్కర్‌ మరో 16మంది కలిసి దాదాపు రూ.1.20 కోట్లు డబ్బును మెటాలో పెట్టుబడులుగా పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్‌ త్రీటౌన్‌లో గురువారం రాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు. తెలంగాణ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్సియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1999 సెక్షన్‌ (5) కింద కట్ల సతీశ్‌పై కేసు నమోదు చేశారు. ఇది నాన్‌బెయిలబుల్‌. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును దుర్వినియోగం చేసిన సందర్భాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు ప్రయోగిస్తారు. పోలీసుల అభియోగాలు రుజువైతే రూ.లక్ష జరిమానాతోపాటు పదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్‌ ప్రకారం దర్యాప్తులో భాగంగా డిపాజిటర్ల నుంచి సేకరించిన పెట్టుబడులతో కొన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటిని వేలం వేసి బాధితులకు అందజేసే వీలుంది. అదే సమయంలో ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. వీటితోపాటు ద ప్రైజ్‌ చిట్స్‌ అండ్‌ మనీ సర్కులేషన్‌ స్కీమ్స్‌ బ్యానింగ్‌ యాక్ట్‌ 1978 సెక్షన్‌ (3), (4) కూడా పెట్టడం గమనార్హం.

క్రిప్టో నిందితులపై కఠిన చర్య తీసుకోవాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: క్రిప్టో కరెన్సీ పేరిట మోసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ఒక ప్రకటనలో కోరారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా విడిచి పెట్టవద్దన్నారు. మెటా ఫండ్‌ క్రిప్టో కరెన్సీ కేసులో అరెస్టయిన మాజీ కార్పొరేటర్‌ కట్ల సతీశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించాలని పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు లేఖ రాసినట్లు తెలిపారు. సతీశ్‌ బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడే క్రిప్టో పేరిట డబ్బులు వసూలు చేశాడని అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే కఠిన చర్యలు తీసుకుంటే చాలామంది మోసపోకుండా ఉండేవారని అన్నారు. క్రిప్టో నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజలకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement