
మహిళా కాంగ్రెస్‌లో పదవుల పంచాయితీ
కరీంనగర్ కార్పొరేషన్: మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలి నియామకం ఆ పార్టీలో పంచాయితీకి కారణమైంది. నగర అధ్యక్షురాలిగా వెన్నం రజితారెడ్డిని నియమిస్తూ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ఈ నెల 9వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. శనివారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సిటీ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమవేశంలో నగర అధ్యక్షురాలు నియామకాన్ని బహిరంగంగా ప్రకటించగా, పలువురు మహిళానాయకురాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెకు పదవి ఎలా ఇస్తారంటూ సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహ న్‌ను నిలదీశారు. సమావేశం ముగిసిన అనంతరం కూడా సుడా చైర్మన్ వాహనానికి అడ్డుగా బైఠాయించి నిరసన తెలిపారు. చివరకు అది పార్టీ తీసుకున్న నిర్ణయమని సర్ది చెప్పి నరేందర్‌రెడ్డి వెళ్లిపోయారు.
‘వెలిచాల’ అభినందన
మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలుగా నియామకమైన రజితరెడ్డిని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అభినందించారు. నగరంలోని ప్రజాకార్యాలయంలో రాజేందర్‌రావును రజిత మర్యాదపూర్వకంగా కలిశారు. రజితను ఆయన శాలువతో సత్కరించారు. నాయకులు ఆకుల నర్సయ్య, కోటగిరి భూమాగౌడ్, ఆకుల ఉదయ్, వేల్పుల వెంకటేష్‌పటేల్, బట్టు హరికృష్ణ పాల్గొన్నారు.