
సారూ.. ఒక్కబస్తా ఇవ్వరూ
శంకరపట్నం/తిమ్మాపూర్: జిల్లాలో అన్నదాతలకు యూరియా గోస తప్పడం లేదు. తెల్లవారకముందే రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. శంకరపట్నం మండలం మెట్టుపల్లి సహకార సంఘం పరిధిలోని కొత్తగట్టు గోదాంకు లారీలో 450 బస్తాల యూరియా వచ్చింది. కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాలతో పాటు సైదాపూర్ మండలానికి చెందిన రైతులు శనివారం వేకువజామున్నే బారులు తీరారు. కౌలు రైతులు యజమాని పాసుపుస్తకం జిరాక్స్‌లు ఇచ్చారు. సంబంధిత వ్యక్తి వస్తేనే యూరియా ఇస్తామని ఏఈవోలు తిరుపతి, కీర్తన చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. తిమ్మాపూర్ మండలం పోరండ్ల సొసైటీ ఆధ్వర్యంలో మన్నెంపల్లి అమ్మకాల కేంద్రం వద్ద ఉదయాన్నే రైతులు బారులు తీరారు. సరిపడని బస్తాలు లేక వెనుదిరిగారు. నుస్తలాపూర్ సొసైటీ వద్ద రైతులు ఉదయం నుంచే క్యూ కట్టారు.