
ముంబయి–కరీంనగర్ మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు
రామగుండం: రాబోయే దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని పలు రూట్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మధ్య రైల్వే జోన్ పరిధిలోని ముంబాయి డివిజన్ రైల్వే అధికారులు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 26 మధ్య రైలు నడపనుంది. రైలు నం.01067 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్(సీఎస్‌ఎంటీ) లోకమాన్య తిలక్ టర్మినస్(ఎల్‌టీటీ) ముంబాయి నుంచి కరీంనగర్ మధ్య రాకపోకలు సాగించి అక్టోబర్ 1, 8, 15, 22, 29, నవంబర్ 5, 12, 19, 26ల్లో కరీంనగర్‌కు ఉదయం 8.30 గంటలకు చేరుకోనుంది. రైలు నం.01068 తిరుగు ప్రయాణం కరీంనగర్–ముంబయి వరకు అదే తేదీల్లో కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ముంబాయి చేరుకుంటుంది. కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ జంక్షన్, బాసరలో హాల్టింగ్స్ కల్పించారు. ఈ రైలులో షిర్డీ వెళ్లే భక్తులు నాగర్‌సోల్‌లో దిగి వెళ్లేందుకు అవకాశముంటుంది. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకునేందుకు నాసిక్‌లో హాల్టింగ్ ఉంది. ఈ రైలుకు ఫస్ట్ క్లాస్ ఏసీ–1, 2, సెకండ్‌క్లాస్ ఏసీ–2, థర్డ్ ఏసీ–6, స్లీపర్ క్లాస్–8, జనరల్ బోగీలు 3 ఉంటాయి. ఈ రైలు కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో కనీసం 9 గంటలు ప్లాట్‌ఫారంపై ఉండడంతో దానిని కాగజ్‌నగర్ వరకు పొడిగించే అవకాశాలను పరిశీలించాలని ప్రయాణికులు కోరుతున్నారు.