
అక్షర చైతన్యానికి శ్రీకారం
● మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం ● పూర్తయిన నిరక్షరాస్యుల గుర్తింపు సర్వే ● విద్యాశాఖ, వయోజన విద్య, ఐకేపీలకు సమన్వయ బాధ్యతలు ● ‘ఓపెన్’లో చేర్పించి చదివించేలా చర్యలు ● జిల్లాలో 21,894 మంది నిరక్షరాస్య మహిళలు
గంభీరావుపేట(సిరిసిల్ల): స్వయం సహాయక సంఘాల్లోని మహిళలల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. విద్యాశాఖ, వయోజన విద్య(ఉల్లాస్), ఐకేపీ శాఖలు సంయుక్తంగా మహిళల్లో అక్షర చైతన్యం కలిగించడానికి శ్రీకారం చుట్టారు. టాస్(తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ)లో చేర్పించి అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ కారణాలతో చదువుకోలేకపోయిన, మధ్యలో చదువు మానేసిన వారిని ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్‌లో చేర్పిస్తున్నారు.
జిల్లాలో 21,894 మంది నిరక్షరాస్యులు
జిల్లాలోని 10 వేల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులైన మహిళా సభ్యులను గుర్తించడానికి అధికారులు సర్వే చేపట్టారు. ఐకేపీ అధికారులు, సీసీలు, వీవోఏలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. జిల్లాలో 21,894 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అంచనా. వారిలో ఇప్పటి వరకు 12,203 మందిని గుర్తించారు. అందులో ఓపెన్ స్కూల్‌లో చదివించడానికి 1,157 మందిని పదో తరగతిలో, 712 మందిని ఇంటర్‌లో చేర్పించారు. అక్షర జ్ఞానం కలిగించడానికి ఉల్లాస్ యాప్‌లో 1,802 మంది పేర్లను అధికారులు నమోదు చేశారు.
స్వచ్ఛంద వలంటీర్లతో విద్యాబోధన
చదువు నేర్పించడానికి ఎలాంటి పారితోషికం ఆశించకుండా విద్యాబోధన అందించడానికి స్వచ్ఛందంగా పనిచేయడానికి 1,071 మంది వలంటీర్లు అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి 110 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఉపాధ్యాయులు, ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు వలంటీర్లుగా పనిచేసే అవకాశం ఉంది. వీరికి ప్రత్యేక ప్రశంసాపత్రాలు, సత్కారాలు చేసి ప్రొత్సహించడానికి ప్రభుత్వం యోచిస్తోంది.