
ప్రాణం తీసిన చేపల వేట
గంగాధర(చొప్పదండి): చేపల వేట ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆదివారం వరదకాలువ నీటిలో మునిగి మృతిచెందిన యువకుడి మృతదేహాన్ని సోమవారం బయటకు తీశారు. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. రామడుగు మండల కేంద్రానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ (30) మండలంలోని కొండన్నపల్లి గ్రామ శివారులో వరదకాలువలో ఆదివారం సాయంత్రం చేపల వేటకు వచ్చాడు. ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయాడు. ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు. సోమవారం మృతుడి సోదరుడు ఇమ్రాన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గుండెపోటుతో మత్స్యకారుడి మృతి
మల్లాపూర్: చేపలు పట్టేందుకు చెరువులోకి వెళ్లిన మత్స్యకారుడు చిట్యాల రెడ్డి (70) అక్కడే గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ముత్యంపేటలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చిట్యాల రెడ్డి (70)కి భార్య రాజగంగు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పిల్లలందరికీ వివాహమైంది. చేపలు పడుతూ.. వ్యవసాయ పనులు చేసుకుంటూ.. జీవిస్తున్నాడు. కులసభ్యులతో కలిసి శివారులోని చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా గుండెపోటుకు గురైన రెడ్డి కుప్పకూలగా.. కులసంఘం సభ్యులు ఒడ్డుకు చేర్చి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన మెట్‌పల్లిలోని ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలిస్తుండగానే మార్గంమధ్యలో పరిస్థితి విషమించి మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.
చికిత్సపొందుతూ ఒకరు..
రామగుండం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాలు.. అక్బర్‌నగర్‌కు చెందిన సలిగంటి పూర్ణ చంద్రశేఖర్(33) ఆదివారం మల్యాలపల్లి సబ్‌స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా కుందనపల్లి ఎక్స్‌రోడ్ వద్ద కరీంనగర్ నుంచి గోదావరిఖని వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడు. కాగా మృతుడి కుటుంబసభ్యుల కోరిక మేరకు అతడి నేత్రాలను దానం చేయడానికి నిర్ణయించగా, ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సీనియర్ టెక్నీషియన్ సతీశ్‌కుమార్ బృందం కళ్లను సేకరించారు. మృతుడికి భార్య అనూష, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ప్రాణం తీసిన చేపల వేట

ప్రాణం తీసిన చేపల వేట