
‘పొలాస’కు కోరుట్ల వ్యవసాయ విద్యార్థినులు
జగిత్యాలఅగ్రికల్చర్: సోషల్ వెల్ఫేర్ గురుకులం సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోరుట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులను సామాజిక కోణంలోనే పొలాస వ్యవసాయ కళాశాలకు తరలించామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ డీన్ ఝాన్సీరాణి అన్నారు. పొలాస వ్యవసాయ కళాశాలకు కోరుట్లలోనివ్యవసాయ కళాశాల నుంచి 93 మంది విద్యార్థినులను తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ వర్సిటీలో ఓ కళాశాల నుంచి మరో కళాశాలకు వెళ్లడం కుదరదని, ఆ నిబంధనను మార్చి.. పేద విద్యార్థినులకు న్యాయం చేయాలనే ఆశయంతో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ జానయ్య, గురుకులం సొసైటీ కమిషనర్ అలుగు వర్షిణి ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. గురుకులం సొసైటీ అడిషనల్ సెక్రటరీ ఎన్. కిరణ్మయి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సరైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే పొలాస వ్యవసాయ కళాశాలలో కలిపారని పేర్కొన్నారు. స్టూడెంట్ ఆఫైర్ డీన్ సీహెచ్. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ విద్యను సవాల్‌గా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. గురుకులం సొసైటీ జాయింట్ సెక్రటరీ పీఎస్‌ఆర్.శర్మ మాట్లాడుతూ.. సాఫ్ట్‌వేర్ రంగం కంటే వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ భారతీనారాయణ్ భట్ మాట్లాడుతూ.. పొలాస వ్యవసాయ కళాశాలకు పేరు తేవాలని, ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. నూతనంగా వచ్చిన విద్యార్థినులకు పొలాస విద్యార్థినులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్‌కుమార్ శర్మ, కళాశాల స్టూడెంట్ ఆఫైర్ కన్వీనర్ రత్నాకర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.