గెస్ట్‌హౌస్‌ గోల్‌మాల్‌! | - | Sakshi
Sakshi News home page

గెస్ట్‌హౌస్‌ గోల్‌మాల్‌!

Jul 13 2025 7:42 AM | Updated on Jul 13 2025 7:42 AM

గెస్ట

గెస్ట్‌హౌస్‌ గోల్‌మాల్‌!

కార్పొరేషన్‌ కహానీ–4

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/కరీంనగర్‌కార్పొరేషన్‌:

గరపాలక సంస్థలో మరో సంచలనం. అక్రమంగా నియమించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు చెల్లించిన జీతాలను, అధికారుల నుంచి రివకరీ చేయాలని విజిలెన్స్‌ ఆదేశించింది. ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ (అప్పట్లో కేసీఆర్‌ హౌస్‌)లో 12 మందిని ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతి లేకుండా నియమించారనే ఫిర్యాదులపై ఏడాదిన్నరగా విచా రణ కొనసాగుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో నియమకాలు అక్రమమే అని తేల్చిన విజిలెన్స్‌, సంబంధిత బల్దియా అధికారుల నుంచి రూ.9 లక్షలు రికవరీ చేయాలనడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

అడ్డదారిలో 12 మంది నియామకం...

గత ప్రభుత్వ హయాంలో నగరంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ను కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌హౌస్‌ (కేసీఆర్‌ హౌస్‌)గా ఆధునీకరించారు. నిర్మాణం పూర్తయ్యాక, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గెస్ట్‌ హౌస్‌లో పనిచేసేందుకు నగరపాలక సంస్థ నుంచి 12 మందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియమించారు. అయితే ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేకుండా, కనీస ఉత్తర ప్రత్యుత్తరాలు జరగకుండానే స్థానికంగా నిర్ణయం తీసుకొని నియామకాలు చేపట్టారు. 12 మందిని తొలగించేనాటికి నగరపాలకసంస్థ నుంచి రూ.9,26,585 జీతాల రూపంలో చెల్లించారు.

ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో...

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్‌ హౌస్‌ పేరును తిరిగి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌గా మార్చడంతో పాటు, అక్రమ నియామకాలపై దృష్టి సారించింది. 12 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్కరి నుంచి ఉద్యోగం పేరిట రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు పలువురు మాజీ కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు వసూలుచేసినట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీనితో ప్రభుత్వ పెద్దల సూచనతో విజిలెన్స్‌ విచారణ మొదలైంది. ఏడాదిన్నరగా సాగిన విజిలెన్స్‌ విచారణలో 12 మంది నియామకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని తేలింది. అంతేకాకుండా రాజకీయ నేతల ఒత్తిళ్ల వల్లే తాము 12 మందిని నియమించామని విచారణలో సంబంధిత అధికారులు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. నియామకానికి కారణం ఎవరైనా, నియమించడం, ఆ తరువాత వారికి జీతాల చెల్లింపులో సాంకేతికంగా అధికారులదే తప్పిదంగా విజిలెన్స్‌ నిర్ధారించింది.

రూ.9లక్షలు రికవరీ

గెస్ట్‌హౌస్‌లో అనుమతి లేకుండా నియమించిన 12 మందికి చెల్లించిన జీతాలను సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్‌ ఆదేశించడం ప్రస్తుతం ప్రకంపనాలు సృష్టిస్తోంది. 12 మందికి జీతాల రూపంలో చెల్లించిన రూ.9 లక్షల 26 వేల 585ను అప్పటి అధికారుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. అందులో 8 లక్షల 99 వేల 600 నగరపాలక సంస్థ అధికారుల నుంచి, మూడు శాతం కమీషన్‌ రూపంలో ఆదాయం పొందిన వారధి నుంచి రూ.26,985ని రికవరీ చేయాలని సూచించారు. కాగా.. రికవరీకి ఆదేశించిన అధికారుల్లో గతంలో పనిచేసిన ఇద్దరు నగరపాలకసంస్థ కమిషనర్లు, శానిటరీ సూపర్‌వైజర్‌, సూపరింటెండెంట్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, జవాన్‌ ఉండడం సంచలనంగా మారింది. ఏ అధికారి నుంచి ఎంత వసూలు చేయాలనే స్పష్టత రాలేదు.

12 మంది నియామకం అక్రమం

విచారణలో తేల్చిన విజిలెన్స్‌!

రూ.9లక్షలు రికవరీకి ఆదేశం

బల్దియాలో ప్రకంపనం

గెస్ట్‌హౌస్‌ గోల్‌మాల్‌!1
1/1

గెస్ట్‌హౌస్‌ గోల్‌మాల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement