చేపల వేటపై నిషేధం | - | Sakshi
Sakshi News home page

చేపల వేటపై నిషేధం

Jul 7 2025 6:14 AM | Updated on Jul 7 2025 6:14 AM

చేపల

చేపల వేటపై నిషేధం

పునరుత్పత్తి దశ కావడంతో నిర్ణయం

జూలై, ఆగస్టులో చేపలు పడితే చర్యలు

రెండు కిలోల చేపల నుంచి లక్షన్నర చేప పిల్లల ఉత్పత్తి

జగిత్యాలఅగ్రికల్చర్‌: జలాశయాలు, చెరువులు, కుంటలు, వరదకాలువ, గోదావరి పరీవాహక ప్రాంత జలాశయాల్లో జూలై, ఆగస్టు నెలల్లో చేపలు పట్టకుండా మత్స్యశాఖ నిషేధాజ్ఞలు జారీ చేసింది. మత్స్యశాఖ ఆదేశాలు ఉల్లంఘించి చేపలు పడితే, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ రెండు నెలల్లో చేపల పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి, చేపల పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీయవద్దని సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌, గోదావరి నదిలో, వరదకాలువలో చేపలవేటపై పూర్తిస్థాయి మానిటరింగ్‌ ఉంటుందని అధికారులు ప్రకటించారు.

నిషేధం ఎందుకంటే

వర్షాకాలంలో ఇబ్బడి, ముబ్బడిగా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో చేపల్లో పునరుత్పత్తి హార్మోన్‌ బలంగా అభివృద్ధి చెందుతుంది. జూలై, ఆగస్టులో చేపలు తమ పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. ఆడ చేపలు ఎగ్‌ రిలీజ్‌ చేస్తే, మగ చేపలు స్పెర్మ్‌ను రిలీజ్‌ చేస్తాయి. దీంతో చేప పిల్లలు బయటకు వస్తాయి. ముఖ్యంగా, వర్షాకాలంలో జలాశయాల్లోకి కొత్త నీరు వస్తుండటం, ఆ నీరుతో పాటు చెత్త, చెదారం కొట్టుకుని వచ్చి నీళ్లపై తేలుతూ ఉంటాయి. ఈ సమయంలో చెత్త, చెదారం కింది భాగంలో ఆడ చేపలు గుడ్లపై పొదుగుతుంటాయి. వాటిపై సూర్యరశ్మి పడి, 2–3 రోజుల్లోనే గుడ్ల నుండి చేప పిల్లలు బయటకు వస్తాయి. ఈ ప్రక్రియంతా జూలై, ఆగస్టులో 3నుంచి 5 సార్లు జరుగుతుంది.

రెండు కిలోల చేపల నుంచి లక్షన్నర పిల్లలు

రెండు కిలోల చేపల నుంచి లక్షన్నర పిల్లలు బయటకు వస్తాయి. అందులో 10శాతం బతికినా.. పదివేల చేపలు ఉత్పత్తి అవుతాయి. దాదాపు టన్ను నుంచి టన్నున్నర చేపల ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. వర్షాకాలంలో చేపలు వేటగాళ్లకు తొందరగా చిక్కుతాయి. ఈ రెండు నెలల్లో ఒక్కచేపను కోల్పోయిన, దాని నుంచి వచ్చే లక్ష చేప పిల్లలను కోల్పోయినట్లే. ఈ మేరకు చేపల సంఖ్యను పెంచేందుకు మత్స్యశాఖ స్పష్టమైన అదేశాలు జారీ చేసింది.

జిల్లాలో నెలకు 100– 150 టన్నుల చేపల ఉత్పత్తి

జిల్లాలోని అన్ని జలాశయాల్లో నెలకు 100నుంచి 150 టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. 696 చెరువులు, కుంటలు ఉండగా, వాటి పరిధిలో 18,336 హెక్టార్ల విస్తీర్ణం గల భూమి ఉంది. జిల్లాలో మొత్తం 254 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, వాటిలో 18,500 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా చెరువులు, కుంటల్లోని చేపలను పట్టుకుని ఉపాధి పొందుతున్నారు.

చెరువుల్లోని చేపలతోనే ఉత్పత్తి

గత కొన్నేళ్లుగా జిల్లాలోని చెరువుల్ల్లో 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను వదిలారు. ఈ పథకం పెద్దగా ఉపయోగపడలేదు. చేప పిల్లలను వదిలే సమయం అంటూ లేకుండా వదలడంతో చిన్న చేప పిల్లలను పెద్దవి తినడం, వాతావరణం సహకరించక కొన్ని చేప పిల్లలు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న చేపలను రెండు నెలల పాటు వేటాడకుండా, అలాగే వదిలేస్తే ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలు అవసరం లేకుండా, చెరువుల్లోని చేపలతోనే లక్షలు, కోట్లు చేపలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది.

ఒక్క చేపను పట్టినా పునరుత్పత్తిని దెబ్బతీసినట్లే

ఈ రెండు నెలల్లో ఒక్కచేపను పట్టినా లక్షల చేపలను పుట్టకుండా చేసినట్లే. జూలై, ఆగస్టు నెలల్లోనే చేపలు పునరుత్పత్తి చేస్తుంటాయి. కాబ ట్టి జలాశయాల్లోని చేపలకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలి. ఎవరైనా చేపలు పడితే అధికారుల దృష్టికి తీసుకురావాలి.

– అరుణ్‌కుమార్‌, మత్స్యశాఖ నిపుణుడు, జగిత్యాల

రెండునెలల పాటు నిషేధం

జూలై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని జలాశయాల్లో చేపల వేటను నిషేధించడమైంది. మత్స్యకారుల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిషేధాజ్ఞలు జారీ చేయడమైంది. చేపలు పట్టడం వల్ల పునరుత్పత్తి ప్రక్రియ నిలిచిపోతుంది.

– శ్రీనివాస్‌, మత్స్యశాఖాధికారి, జగిత్యాల

చేపల వేటపై నిషేధం1
1/2

చేపల వేటపై నిషేధం

చేపల వేటపై నిషేధం2
2/2

చేపల వేటపై నిషేధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement