అర్థవంతమైన ‘పాట’.. బడికి బాట
సిరిసిల్ల: ‘సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది.. రారమ్మన్నదీ.. ఇంగ్లిష్ చదువు కూడా చెప్పుచున్నది.. ఎంతో నేర్పుతున్నది.. పద పదా పోదాం సర్కారూ బడికి.. పైసన్నది ఖర్చులేని అమ్మ ఒడికి’.. అంటూ సాగే అర్థవంతమైన పాట, చక్కటి సంగీతం, పాఠశాల ఫొటోలతో.. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యాలతో రూపొందించి సోషల్ మీడియా వేదికగా బడిబాట పాటను ప్రచారం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేందంల్రోని వెంకంపేట మండల పరిషత్ ప్రాథమి పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంపై నెల రోజుల ముందే చక్కటి ఆడియో, వీడియో పాటను చిత్రీకరించి వేసవి సెలవుల్లో ప్రజాబాహుళ్యంలోకి పంపించారు. ఇప్పుడు ఆ పాట.. బడి బాటకు పల్లవిగా మారి మారుమోగుతోంది.
అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా..
వెంకంపేట ఎంపీపీఎస్ స్కూల్‌లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంది. ఇక్కడ ప్రస్తుతం వంద మంది విద్యార్థులు ఉండగా, మరో 50 మందికి అడ్మిషన్లు ఇచ్చే లక్ష్యంతో హెచ్‌ఎం మోర దామోదర్, ఉపాధ్యాయులు సీహెచ్ రాణి, కె.పద్మ, సౌభాగ్యల బృందం ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. వెంకంపేట ప్రాంతంలో ఉండే ప్రతీ ఇంటికి వెళ్లి.. ‘మీ పిల్లలను మా బడికి పంపించండి.. ఉచితంగానే ఇంగ్లిష్‌లో బోధిస్తాం’ అని చెబుతూ పిల్లలను బడిలో చేర్పించుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ముందే రూపొందించిన బడి పాటను ఇంటి యజమానుల వాట్సప్ గ్రూపుల్లోకి డౌన్‌లోడ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. బడిలో ఉన్న వసతులు, పక్కా భవనం, ఆటస్థలం, డెస్క్ బేంచీలు, మధ్యాహ్నం భోజనం, ఉచితంగా పుస్తకాలు, యూనిపామ్స్ ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని వివరిస్తున్నారు.
అందరి సహకారంతో..
బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టాం. నెల రోజుల ముందే పాటను రూపొందించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశాం. అందరి సహకారంతో పాఠశాలలో వసతులు కల్పించాం. బడిలో అడ్మిషన్లు పెంచే లక్ష్యంతో బడిబాట నిర్వహిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తుంది.
– మోర దామోదర్, హెచ్‌ఎం, వెంకంపేట స్కూల్
అర్థవంతమైన ‘పాట’.. బడికి బాట


