ఫలితాలే ప్రామాణికంగా..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గత విద్యాసంవత్సరంలో వచ్చిన ర్యాంకులు, ఉత్తీర్ణతశాతంపై ఎంఈవో కృష్ణహరి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కరపత్రాలు, బ్యానర్లు, ప్లకార్డులు, వాల్ పోస్టర్లు తయారు చేయించి గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ.. పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించాలని కోరుతున్నారు. తమపై నమ్మకంతో చేర్పిస్తే వారిని నిష్ణాతులుగా తయారు చేస్తామని తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నారు. దీంతో మండలవ్యాప్తంగా 105 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరడానికి అంగీకార పత్రాలు రాసిచ్చారు.
ఎంఈవో ముందుచూపుతో..
గత విద్యా సంవత్సరం పది ఫలితాలే ప్రామాణికంగా ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. మండలంలోని దుమాల ఉన్నత పాఠశాలకు చెందిన రామిండ్ల అర్పిత 574 మార్కులతో జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే రాచర్లగొల్లపల్లి జెడ్పీహెచ్‌కు చెందిన పి.ప్రణవి 564 రెండోస్థానంలో నిలవగా, రాచర్లబొప్పాపూర్ స్కూల్‌కు చెందిన రిషిక, శ్రీవర్షిని 562, రాచర్లతిమ్మాపూర్‌కు చెందిన నాగవర్షిణి 559, వెంకటాపూర్‌కు చెందిన సురేఖ 559 మార్కులు సాధించారు. ఇలా మండలవ్యాప్తంగా 450మంది పదో తరగతి పరీక్షలు రాయగా, వారిలో 120 మంది 500లకు పైగా మార్కులు సాధించడం విశేషం. దీన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఫలితాల కరపత్రాల ద్వారా ఇంటింటా ప్రచారం చేయడం కలిసివస్తోంది. ఎంఈవో ముందుచూపుతో వినూత్న ఫలితాలను చూసి సర్కార్ బడిలో చేరాలని చేసిన ప్రయత్నం ఫలించింది. ఇప్పటికే 105 మంది ప్రవేశాలకు అంగీకరించారు.
వేసవి సెలవులు కలిసొచ్చాయి
వేసవి సెలవులు కలిసొచ్చాయి. సెలవుల్లో నాతో పాటు ఉపాధ్యాయులు ఇంటికి పరిమితం కాకుండా కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ప్లకార్డులు, బ్యానర్లు ముద్రించి ఇంటింటా ప్రచారం చేయడంతో మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాల ఏర్పాటు కూడా కొత్త విద్యార్థుల చేరికకు కారణమైంది. రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలే లక్ష్యంగా పని చేస్తాం.
– కృష్ణహరి, ఎంఈవో, ఎల్లారెడ్డిపేట
ఫలితాలే ప్రామాణికంగా..
ఫలితాలే ప్రామాణికంగా..


