స్వచ్ఛనగరం కోసం 100 రోజులు
కరీంనగర్ కార్పొరేషన్: నివాసయోగ్యమైన, పర్యావరణ అనుకూల నగరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వందరోజుల ప్రణాళికను చేపట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు నగరంలో ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దడంతో పాటు, విపత్తులను సైతం ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ తెలిపారు.
వందరోజుల పాటు కార్యక్రమాలు..
నగరవ్యాప్తంగా మురుగు నీటి కాలువలు, నాలాల్లో పూడికలు తీయడం, పారిశుద్ధ్యంపై ఇంటింటికి అవగాహన కల్పించడం, హోం కంపోస్టింగ్ తయారు చేయడం, ఇంటి వద్దనే చెత్తను వేరుచేయడం, కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ తదితరాలు తనిఖీ చేస్తారు. రోడ్ల పక్కన పిచ్చి మొక్కలు తొలగించడం, డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాల నివారణ చర్యలు, దోమల నియంత్రణ డ్రైవ్, డంపింగ్ యార్డు, పొడిచెత్త, తడిచెత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల సందర్శన, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం, పాఠశాలలు, కళా శాలల్లో కంపోస్టింగ్ యూనిట్స్ ఏర్పాటు, మున్సి పల్ కార్మికులకు ఆరోగ్య శిబిరాల ఏర్పాటు చేస్తారు. స్వచ్ఛతపై అవగాహనను కల్పించేందుకు స్వఛ్ వాక్ ర్యాలీలు, స్వచ్ఛత, అవార్డులు, క్వీజ్ పెయింటింగ్, రంగోళి పోటీలు, కళా ప్రదర్శనలు, యానిమేషన్ ఫిల్మ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు ప్రదర్శిస్తారు. ఆస్తి పన్ను సవరణ, నల్లా కనెనెక్షన్‌ల ఆన్‌లైన్ నమోదు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళ, స్ట్రీట్‌ఫుడ్ ఫెస్టివల్, వీధి విక్రయదారులతో గ్రూపులు ఏర్పాటు చేయడం, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీలు కల్పిస్తారు. ప్రస్తుతం ఉన్న వెండింగ్ జోన్లను సమీక్షించడంతో పాటు, పట్టణ పేద మహిళల గుర్తింపు సర్వే, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేస్తారు. లోతట్టు ప్రాంతాలు, గుంతలు నింపడంతో శిథిలభవనాలు తొలగిస్తారు. జంక్షన్లు, పిల్లల పార్క్‌ల అభివృద్ధి, వనమహోత్సవం, ఇంకుడుగుంతల ఏర్పాటు, వీధి కుక్కల సంతాన నియంత్రణ, నీటిక్లోరినేషన్ పరీక్ష లాంటి కార్యక్రమాలు చేపడుతారు.
వలంటీర్లు, సిబ్బందికి శిక్షణ
వందరోజుల కార్యక్రమంపై నగరపాలకసంస్థ సిబ్బంది, వలంటీర్‌లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు నోడల్ అధికారులను కూడా నియమిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వంద రోజుల ప్రణాళికపై సీడీఎంఏ దిశానిర్దేశం చేశామన్నారు. ‘ఒక చర్య ఒక మార్పు’ ‘ప్రజలే ముందు’ అనే నినాదాలతో ప్రజల భాగస్వామ్యంతో వందరోజుల ప్రణాళిక విజయవంతం చేస్తామన్నారు.
వచ్చేనెల 2 నుంచి
సెప్టెంబర్ 10 వరకు అమలు


