
సరికొత్తగా కరీంనగర్ రైల్వేస్టేషన్
● అమృత్‌భారత్ పథకంలో రూ.25కోట్లతో ఆధునీకరణ ● నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ ● హాజరు కానున్న కేంద్ర మంత్రి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం
కరీంనగర్‌రూరల్: రైలు ప్రయాణం మరింత సౌకర్యంగా ఉండేందుకు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారత్ అమృత్ మాల పథకం కింద 2023 ఆగస్టు 6న కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు రూ.25.85 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రైల్వేస్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేశారు. గురువారం ఉదయం9.30గంటలకు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించనుండగా.. కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా పాల్గొంటారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక వసతులు కల్పించారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవనం పక్కనే మరో కొత్త భవనాన్ని నిర్మించారు. ప్రయాణికుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, టికెట్ బుకింగ్ కౌంటర్, షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మించారు. గతంలో ఒక్కటే ఫ్లాట్‌ఫాం ఉండగా కొత్తగా 2,3 ఫ్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జితోపాటు రెండు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు నిర్మించారు. కమర్షియల్ ఇన్స్‌పెక్టర్, స్టేషన్ మేనేజర్, చీఫ్ గూడ్స్ సూపర్‌వైజర్, డెప్యూటీ స్టేషన్ మేనేజర్లకు ప్రత్యేక కార్యాలయాలు నిర్మించారు. ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్‌తోపాటు అతిపెద్ద జాతీయజెండా, ప్రధాన రోడ్డు నుంచి స్టేషన్ రోడ్డులో సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు చేశారు. విద్యుత్ అవసరాల కోసం 115 కిలోవాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మించారు.