
అమ్మ పేరుతో ఒక మొక్క
● వన మహోత్సవంలో మహిళా గ్రూప్‌లు ● మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ ● నగరంలో నాలుగు ప్రాంతాలు సిద్ధం
కరీంనగర్ కార్పొరేషన్:
శరవేగంగా విస్తరిస్తున్న కాంక్రీట్ జంగల్‌లో వాతావరణ సమతుల్యతను పాటించేందుకు ప్రభుత్వం మహిళా సంఘాల భాగస్వామ్యంతో చర్యలు చేపట్టింది. ఈ ఏడాది వనమహోత్సవంలో భాగంగా ఉమెన్స్ ఫర్ ట్రీస్ పేరిట కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ‘ఏక్ పేడ్ మా కే నామ్ పే’ (అమ్మ పేరుతో ఒక మొక్క) అనే నినాదంతో మహిళా సంఘ సభ్యులు మొక్కలు నాటడంతో పాటు, రెండేళ్ల పాటు వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించింది.
నాలుగు ప్రాంతాలు గుర్తింపు
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ అనే నినాదంతో చేపట్టిన వనమహోత్సవ విజయవంతానికి నగరపాలకసంస్థ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చెరువులు, ఖాళీ ప్రాంతాల్లో బల్క్‌గా మొక్కలు నాటనున్నందున, నగరంలో అనువైన స్థలాలు గుర్తించారు. ఆ చెరువుల వద్ద మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించింది. నగరపాలకసంస్థ పరిధిలోని పద్మనగర్‌లోని స్థలంలో దేవిశ్రీ మహిళా సంఘం, కొత్తపల్లి చెరువు సమీ పంలో గాయత్రీ మహిళా సంఘం, రేకుర్తిలోని పెంటకమ్మ చెరువు సమీపంలో శ్రీరంగనాథ మహిళా సంఘం, సీతారాంపూర్ మాలకుంట సమీపంలో నవజ్యోతి మహిళా సంఘానికి మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలు అప్పగించారు.
జూన్ 5వ తేదీ నుంచి షురూ...
నగరపాలకసంస్థ పరిధిలో గుర్తించిన నాలుగు ప్రాంతాల్లో జూన్ 5వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 31వ తేదీ వరకు అంటే దాదాపు రెండు నెలలు కొనసాగనుంది. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులు మొక్కలు నాటడంతో పాటు, సంరక్షణ బాధ్యతలు చేపడుతారు.
ఉద్యమంలా మొక్కలు నాటాలి
నగరంలో ఉద్యమంలా మొక్కలు నాటాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ సూచించారు. నగరంలో మొక్కలు నాటేందుకు గుర్తించిన స్థలాలను గురువారం పరిశీలించారు. సంబంధిత మహిళా గ్రూప్ సభ్యులకు బాటిల్, బుక్, పెన్ తదితర వస్తువులతో కూడిన కిట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 5వ తేదీ నుంచి మొక్కలు విరివిగా నాటాలన్నారు. రెండేళ్లపాటు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. మెప్మా పీడీ వేణు మాధవ్, నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, ఈఈ శ్రీనివాస్, డీఈ లచ్చిరెడ్డి, ఏఈ సల్మాన్, డీఎంసీ శ్రీవాణీ, టీఎంసీ మానస, సీవోలు సునీత, పద్మ, దీప, అంజలి, స్వప్న, పద్మ, తిరుపతి పాల్గొన్నారు.