
భాగ్యరెడ్డి వర్మ చరిత్ర తెలుసుకోవాలి
● జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కరీంనగర్: దళితుల అభ్యున్నతికి కృషి చేసిన ఎం.భాగ్యరెడ్డి వర్మ చరిత్ర అందరూ తెలుసుకోవాలని సుడా చైర్మన్, జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి సూచించారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం వద్ద గల ఆయన విగ్రహానికి కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, మహిళల విద్య, అభివృద్ధికి భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే జయంతిలోగా సుడా నిధులతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఐలాండ్ సుందరీకరణకు నిధులు కేటాయిస్తామని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్‌కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఆర్డీవో మహేశ్వర్, ఎస్సీ సంక్షేమ అధికారి పవన్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవ కమిటీ సభాధ్యక్షుడు కాడే శంకర్, కార్యనిర్వహణ అధ్యక్షుడు బొగ్గుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.