మా ఊళ్లో ఏం జరుగుతోంది? | - | Sakshi
Sakshi News home page

మా ఊళ్లో ఏం జరుగుతోంది?

May 23 2025 2:25 AM | Updated on May 23 2025 2:25 AM

మా ఊళ

మా ఊళ్లో ఏం జరుగుతోంది?

ప్రభుత్వం రూపొందించిన ‘మేరీ పంచాయతీ యాప్‌’లో గ్రామ పంచాయతీల సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. నిధుల వినియోగంలో లోపాలు ఉన్నా, అక్రమాలు జరిగినా యాప్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఆధారాలతో అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

– వీరబుచ్చయ్య, డీపీవో, పెద్దపల్లి

అందుబాటులోకి మేరీ పంచాయతీ యాప్‌ నిధుల ఖర్చులో పారదర్శకతకు ప్రాధాన్యం

ఆదాయ, వ్యయాలను తెలుసుకునే అవకాశం

రామగిరి(మంథని): గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులను గ్రామస్తులు తెలుసుకునేందుకు కేంద్రప్రభుత్వం మేరీ పంచాయతీ(నా పంచాయతీ) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా ఆదాయ, వ్యయాల్లో పారదర్శకత పాటించే ఆవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను పాలకవర్గాలు ఎలా ఖర్చు చేస్తాయనే సమాచారం నేరుగా తెలుసుకోవచ్చు. యాప్‌ను 2019లో రూపొందించినా సాంకేతిక కారణాలతో కొంత సమాచారం అందించలేకపోయింది. ప్రస్తుతం సమగ్ర సమాచారంతో యాప్‌ అందుబాటులోకి వచ్చింది.

పారదర్శక పాలన..

గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతో అభివృద్ధి పనులు చేపడతారు. వాటి వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపర్చాలని, తద్వార గ్రామాల్లో పారదర్శకపాలన సాగుతుందని అధికారులు చెబుతున్నారు. నిధుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉండటంతో గ్రామాభివృద్ధికి ఎలాంటి పనులు చేపడుతున్నారో గ్రామస్తులు తెలుసుకోవచ్చు. వివరాల నమోదు సమయంలోనే జీపీఆర్‌ఎస్‌ ద్వారా గుర్తించే ఆవకాశం ఉండటంతో అక్కడి పనులకు కేటాయించిన నిధులను ఇతరచోట్ల వినియోగించేందుకు వీలు ఉండదు. పాలకవర్గాలు సైతం పొరపాట్లు చేయడానికి అవకాశం ఉండదు. పాలకులు, అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రశ్నించడానికి వీలు కలుగుతుంది.

కొరవడిన అవగాహన

మేరీ పంచాయతీ యాప్‌పై గ్రామస్తులకు అవగాహన కల్పించడంలో అధికారులు వెనుకబడ్డారు. చాలా వరకు గ్రామాల్లో చదువుకున్న యువతకు తప్ప మరొకరికి ఈ యాప్‌ ఉన్నట్లు కూడా తెలియదంటున్నారు. యాప్‌పై అవగాహన లేక చాలామంది తమ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి వివరాలను తెలుసుకోలేకపోతున్నారు.

ప్లేస్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌..

స్మార్ట్‌ ఫోన్‌లోని ప్లేస్టోర్‌ యాప్‌లో మేరీ పంచాయతీ పేరిట సెర్చ్‌ చేయగానే వచ్చే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక లాగిన్‌ అవ్వాలి. ఆ వెంటనే ఫైనాన్షియల్‌ ఇయర్‌, స్టేట్‌, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు కనిపిస్తాయి. వాటిని నమోదు చేయగానే ఆయా పంచాయతీల సమాచారం కనిపిస్తుంది. గ్రామం పేరు, లేదంటే పిన్‌కోడ్‌తో గ్రామ పంచాయతీ పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంటుంది. చేసిన పనుల ఫొటోలను యాప్‌లో పొందుపరుస్తారు. పల్లెపాలనలో పారదర్శకతకు ఈ యాప్‌ ఎంతోగానో ఉపయోగపడుతుంది.

అన్ని వివరాలు నిక్లిప్తం

గ్రామ పంచాయతీల నిధుల వివరాలు మాత్రమే కాకుండా సర్పంచ్‌(ప్రస్తుతం లేరు), కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తుల వివరాలన్నీ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా మంజూరు చేసే నిధుల వివరాలు, దేనికి ఎంతఖర్చు చేశారు, పనులు ఏదశలో ఉన్నాయన్న వివరాలు ఇందులో నమోదై ఉంటాయి. నిధుల్లో ఎక్కువగా కార్మికులు, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు యాప్‌లో పొందుపర్చుతారు. ఇవే కాకుండా వచ్చే ఏడాది అంచనా వ్యయాల నమోదుతో పాటుగా, గ్రామసభల వివరాలు సైతం యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

అవగాహన కల్పించాలి

పంచాయతీల పద్దుల వివరాలు తెలుసుకునేందుకు ఓ యాప్‌ ఉందనే విషయం చాలామందికి తెలియదు. దీంతో నిధుల వినియోగం విషయంలో అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజలే నేరుగా నిధుల వివరాలను తెలుసుకునేలా యాప్‌పై అధికారులు అవగాహన కల్పించాలి.

– బొంకూరి పోశం, కల్వచర్ల, రామగిరి మండలం

మా ఊళ్లో ఏం జరుగుతోంది? 1
1/2

మా ఊళ్లో ఏం జరుగుతోంది?

మా ఊళ్లో ఏం జరుగుతోంది? 2
2/2

మా ఊళ్లో ఏం జరుగుతోంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement