
వర్షాలతో అప్రమత్తంగా ఉండండి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: ముందస్తు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ సూచనల నేపథ్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలతో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నాలాల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థకు చేరిన, పాత ఇండ్లు వర్షాలకు నాని కూలిపోయే అవకాశం ఉన్నందున అక్కడ నివసించే వారిని ఖాళీ చేయవలసిందిగా సూచించాలని తెలిపారు. ఐరన్ విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖలోని డీఆర్‌ఎఫ్ టీం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్డీవో మహేశ్వర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.