
పెద్దపల్లి రూరల్: కలెక్టరే పెళ్లి పెద్ద అయ్యారు. అధికారులే అయినవాళ్లయ్యారు. తమ ఇంటి ఆడపడుచులా అక్కున చేర్చుకున్నారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. రామగుండం ప్రాంతానికి చెందిన తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస వివాహం.. రాజేశ్‌తో కలెక్టరేట్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా జరిగింది.
తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన నక్క మానస, నక్క లక్ష్మి అక్కాచెల్లెళ్లు. వీరు 16 ఏళ్లుగా తబితా ఆశ్రమంలో ఉంటున్నారు. మానసకు వివాహం నిశ్చయం కావడంతో వివాహతంతు జరిపించేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ ఆవరణలోని శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని వివాహవేదిక చేశారు. అర్చకుల మంత్రోచ్ఛారణలు, బాజాభజంత్రీల మధ్య ఉదయం 11.05 గంటలకు వివాహం ఘనంగా జరిగింది.
కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ కలెక్టర్ వేణు, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ సహా పలుశాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన రూ.61,800 విలువైన చెక్కును కలెక్టర్ శ్రీహర్ష వధూవరులకు అందించారు. వరుడి బం««ధుమిత్రులతో పాటు మోచి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కార్యదర్శి రాజు, ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు.. మోచికుల ఆ«రాధ్య దైవమైన సంత్ రవిదాస్ హరలయ్య జ్ఞాపికను వధూవరులకు అందజేశారు.