
తాగునీటి కోసం వెళ్లి అనంత లోకాలకు..
● ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైక్‌లు
● హనుమాన్ దీక్షాపరుడి దుర్మరణం
వెల్గటూర్: తాగునీరు తెచ్చేందుకు వెళ్లిన ఓ హనుమాన్ దీక్షాపరుడు రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మృతిచెందిన ఘటన మండలంలోని రాజక్కపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దోరిశెట్టి నిక్షిత్‌వర్మ (17) ఇటీవలే ఇంటర్ పూర్తిచేశాడు. కొందరు యువకులతో కలిసి హనుమాన్ మాల ధరించాడు. ఆదివారం మధ్యాహ్నం భిక్ష సమయంలో పక్కనే ఉన్న కప్పారావుపేటకు స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై తాగునీటి కోసం వెళ్లాడు. రోడ్డు దాటే సమయంలో కరీంనగర్ వైపు వెళ్తున్న బెజ్జంకి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు అన్నాజీ విక్రమ్ అతి వేగంగా.. అజాగ్రత్తగా వచ్చి వీరిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లపై ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిక్షిత్‌వర్మ తలకు బలమైన గాయాలు కావడంతో అంబులెన్స్‌లో కరీంనగర్ తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించేలోపే మృతిచెందాడు. మృతుడి తండ్రి దోరిశెట్టి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు.. చేతికందే వయసులో రోడ్డు ప్రమాదం రూపంలో మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు అక్కడున్న వారందరినీ కలిచి వేసింది.
ఈత కొట్టేందుకు వెళ్లి..
రాయికల్: ఈతకొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి బావిలో మృతిచెందిన ఘటన రాయికల్ మండలం కుమ్మరపల్లిలో చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాధ రెండో కుమారుడు మణిచరణ్. తండ్రి చనిపోవడంతో రాయికల్‌లోని తాత ఉట్నూరు శంకర్ ఇంట్లో ఉంటున్నాడు. పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో కుమ్మరిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ సరదాగా ఈతకొట్టేందుకు బావిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో బింగి మణిచరణ్(12) మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో విద్యార్థి కోసం గాలించగా మృతదేహం లభ్యమైంది.
కారు ఢీకొని యువతి..
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరిలో రోడ్డు ప్రమా దం జరిగింది. బ స్సుకోసం రోడ్డు పక్కన వేచి చూస్తున్న యువతిని కారు ఢీకొనగా.. అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా జాబితాపూర్‌కు చెందిన మౌనిక(23) సుందరగిరిలో స్నేహితురాలి వివాహానికి హాజరైంది. తిరుగుపయనం కోసం సంతోష్ అనే స్నేహితుడితో కలిసి ఫంక్షన్ హాల్ సమీపలో రోడ్డు పక్కన బస్సుకోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా వచ్చిన కారు మౌనిక, సంతోష్‌ను ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. సంతోష్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్సై శ్రీనివాస్ క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. తిమ్మాపూర్ సీఐ సదన్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. తిమ్మాపూర్ మండలం మొగిలి పాలెంకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి వేగంగా, అజాగ్రత్తగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.

తాగునీటి కోసం వెళ్లి అనంత లోకాలకు..

తాగునీటి కోసం వెళ్లి అనంత లోకాలకు..